– సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్‌రెడ్డిని కోరిన మల్లు రవి, రోహిత్ చౌదరి
– వారిని అడ్డుకున్నపటేల్ వర్గీయులు
– చర్చలు జరుపుతున్న రూమ్‌పైకి రాళ్లు విసిరి ఆందోళన
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ నుంచి బీఫాం దక్కక పోవడంతో అసంతృప్తికి లోనైన పలువురు ఆశావహులు రెబెల్స్‌గా నామినేషన్ వేశారు. గెలుపు అవకాశాలను వారు ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో హస్తం పార్టీ బుజ్జగింపులు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం సూర్యాపేట పట్టణానికి చెందిన పటేల్ రమేష్‌రెడ్డి ఇంటికి ఏఐసీసీ సినీయర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్ చౌదరి వెళ్లారు. పటేల్ రమేశ్ రెడ్డి ఈనెల 10న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పటేల్ రమేశ్ రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. నామినేషన్ ఉపసంహరించుకునేది లేదని, అవసరమైతే కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిన దామోదర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పటేల్ రమేశ్ రెడ్డితో గదిలో మాట్లాడుతుండగా ఆయన వర్గీయులు చర్చలు జరుగుతున్న రూమ్ వైపు రాళ్లు విసిరారు. మల్లురవి, రోహిత్ చౌదరిలను బయటకు వెళ్లనివ్వకుండా తాళం వేసే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పెద్దలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నారు.