టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నటుడు సోనూసూద్ ఆసక్తికర విషయాలు చెప్పారు.
కష్టం వచ్చింది.. సాయం చేయండి’ అని వేడుకోవడమే ఆలస్యం.. నేనున్నానంటూ ముందుకొస్తున్నారు సోనూసూద్.
కరోనా వైరస్ మహమ్మారి కబలిస్తున్న ఈ కష్టకాలంలో సోనూసూద్ ఆపద్బాంధవుడిగా నిలిచారు.
సినిమాల్లో విలన్ వేషాలు వేసే సోనూసూద్.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా అవతరించారు.
అడిగిన ప్రతి ఒక్కరికి లేదనకుండా.. కాదనకుండా సాయం అందిస్తున్నారు.
కరోనా కారణంగా గతేడాది విధించిన లాక్ డౌన్ దగ్గర నుంచి లక్షల మందికి సాయం సోనూసూద్ సాయం చేశారు.
వేల మంది వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చి వారిచేత దైవంగా కొనియాడబడ్డారు.
బస్సులు, రైళ్ల నుంచి ఏకంగా విమానాలు వరకు ఏర్పాటు చేసి కార్మికులను తమ గ్రామాలకు చేర్చి వారి కన్నీళ్లు తుడిచాడు.
ప్రాంతం, భాష, కులం, మతం.. ఎలాంటి బేధాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా వెంటనే సోనూసూద్ చేస్తూ వస్తున్నారు.
కరోనా విలయం సమయంలో తన సేవలతో అందరి మన్ననలు పొందుతున్న సోనూసూద్ ఎన్టీఆర్ ట్రస్ట్ శనివారం నిర్వహించిన వెబినార్‌లో పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై సోనూసూద్ ప్రశంసల వర్షం కురిపించారు.
కరోనా మొదటి దశ సమయంలో చంద్రబాబుతో చోటుచేసుకున్న ఓ పరిణామాన్ని వివరించారు.
కరోనా మొదటి దశ సమయంలో ఒక రోజు అర్ధరాత్రి తాను చంద్రబాబును కూడా నిద్ర లేపినట్లు వివరించారు.
అర్ధరాత్రి వేళ అత్యవసరంగా ఒక రోగిని తరలించాల్సి వస్తే.. ఆయన సహాయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆ రోజు చంద్రబాబు రియాక్ట్ అయిన తీరు మర్చిపోలేనని చెప్పారు.
అలాగే, తోటి మనిషిపై సానుభూతి చూపి సాయం చేయడాన్ని మనం అలవర్చుకోవాలని, మన పిల్లలకు అలవాటు చేయాలని సోనూసూద్ అన్నారు.
పిల్లలకు ఖరీదైన కార్లు కొని ఇచ్చే బదులు వారికి ఇతరులకు సాయం అందించడాన్ని నేర్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా మొదటి దశ… రెండో దశ వేర్వేరు కావని, మొదటి దశలో వచ్చిన సమస్యలే రెండో దశను మరింత క్లిష్టతరం చేశాయన్నారు.
మొదట్లో విధించిన లాక్‌డౌన్, తదనంతర పరిణామాలు అనేక మందికి ఉపాధిని దూరం చేశాయని, ఆర్థికంగా కుంగదీశాయని… రెండో దశలో ప్రజలు ఎదుర్కొన్న అనేక సమస్యలకు బీజం మొదటి దశలోనే పడిందని చెప్పారు.
కరోనా సమయంలో అనేక మంది ఉపాధికి, చదువుకు దూరమయ్యారని, ఆరోగ్యం దెబ్బతిందని సోనూసూద్ అన్నారు.
మా ఫౌండేషన్ ద్వారా వీలైనంత మందికి సాయం చేయడానికి ప్రయత్నించామన్నారు.
2 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని.. 2,400 మందికి శస్త్రచికిత్సలు చేయించినట్లు పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కలిపి 18 ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
చంద్రబాబు చెప్పిన మాటలు మాలో స్ఫూర్తిని పెంచుతున్నాయని.. ఇంకా చేయాలన్న పట్టుదల వస్తోందని సోనూ సూద్ పేర్కొన్నారు.
చంద్రబాబు దూరదృష్టి వల్లే..
‘‘నేను సినిమా షూటింగుల కోసం అనేకసార్లు హైదరాబాద్ వచ్చాను.
అక్కడి మౌలిక సదుపాయాలు, నగరం అందం నన్ను బాగా ఆకట్టుకొన్నాయి.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దూరదృష్టితో ఈ నగరానికి కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చడం, ఎంతో శ్రమపడటం దీనికి కారణం.
నేను, నా సహచర నటులకు కూడా ఆయన విజన్ గురించి ఎప్పుడూ చెబుతుంటాను’’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
నా భార్యది గోదావరి జిల్లానే..
తన శ్రీమతిది ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లానే అని సోనూసూద్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తనకు రెండో ఇల్లు వంటివన్నారు.
కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా కరోనా విలయంలో ఎందరికో సేవ చేసే మహద్భాగ్యం తనకు కలిగిందని, ఎంతోమంది, ఎన్నో విధాలుగా తనకు ఈ ప్రయాణంలో సహకరించారన్నారు.
సోనూసూద్‌పై చంద్రబాబు ప్రశంసలు
లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ఇళ్లకు చేర్చడానికి సోనూసూద్ చేసిన కృషి అపూర్వమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఒక రైతు కాడెడ్లు కూడా లేక తన పిల్లలతో కాడి పట్టించి పొలం దున్నుతున్న దృశ్యం చాలా మందిని కదిలించింది. ఆ రైతుకు సోనూసూద్ ట్రాక్టర్ ఇచ్చారు.
ఆ సమయంలో నేను ఆయనతో ఫోన్లో మాట్లాడాను. ఆయనను చూసి మనమంతా గర్వించాలి.
ఆయన నుంచి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా సోనూసూద్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉంది.’’ అని ఆయన అన్నారు.
త్వరలో ఒకసారి కలుద్దామని చంద్రబాబు సూచించగా.. సోనూసూద్ అంగీకరించారు.