ఇంటింటికి మంచినీళ్లు అందించడంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వడదెబ్బ నివారణ చర్యల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు జిల్లా కలెక్టర్లను ఆమె అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని ఆమె అన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు ఇదే విధమైన నిఘా కొనసాగించాలని, ప్రతిరోజూ పరిస్థితిని పర్యవేక్షించాలని ఆమె కలెక్టర్లను కోరారు. ప్రతి ఇంటికి సరిపడా నీటి సరఫరా ఉండేలా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు నియమించిన ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి నీటి సరఫరాలో జరుగుతున్న అంతరాయాల వివరాలను నేరుగా ప్రజల నుంచి అడిగి తెలుసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఈ కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, టార్పాలిన్లు ఏర్పాటు చేశామన్నారు.