Homeహైదరాబాద్latest Newsసికింద్రాబాద్‌లో గట్టిపోటీ..ఎవరు గెలుస్తారో?

సికింద్రాబాద్‌లో గట్టిపోటీ..ఎవరు గెలుస్తారో?

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొన్ని స్థానాల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న ముగ్గురు చట్టసభ సభ్యులు పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున సిటింగ్ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బరిలో ఉండగా బీఆర్‌ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పోటీ పడుతున్నారు. ఇక్కడ మూడు పార్టీలు గెలుపు మాదంటే మాదనే ధీమాతో ముందుకు వెళ్తున్నాయి.

బీజేపీ నుంచి కిషన్ రెడ్డి

ఐదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఏం చేసారన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానంగా ఇప్పటివరకూ చేసిన పనులు, ఖర్చు చేసిన వివరాలను ఓ నివేదిక రూపంలో కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రజలకు అందించారు. ఆసియాలోనే మొట్టమొదటిగా సివిల్ ఏవియేషన్ రిసెర్చ్ ఆర్గనైజేషన్‌ను బేగంపేటలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విమానాశ్రయం తరహాలో ఆధునీకరిస్తున్నామని, 2025 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత అయిన రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు నాయకులు ఇప్పటికే ప్రచారంలో పాల్గొనడంతో కార్యకర్తలు, ప్రజల్లో జోష్ నింపినట్లయింది. వివాదాలకు దూరంగా, అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా గుర్తింపు ఉండటంతో కిషన్ రెడ్డికి సానుకూలంగా కలిసి రానుంది.

కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ..జంట నగరాల్లో మాత్రం తన మార్కును చూపలేకపోయింది. ఎలాగైనా హైదరాబాద్‌లో పాగా వేయాలని, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, హైదరాబాద్ స్థానాలను గెలుచుకోవాలనే పయత్నంలో భాగంగా.. ఖైరతాబాద్ నుంచి ఎన్నికైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొని ఎంపీ టికెట్‌ను ఇచ్చింది.

మంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. పార్టీ క్యాడర్‌తో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతుగా నిలవడం, సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలతో ప్రచారాన్ని ముమ్మరం చేయడం సానుకూలాంశాలుగా ఉన్నాయి.

జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు బీఆర్‌ఎస్ అగ్రనాయకులు కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ గెలుపుపై ధీమాతో ఉన్నట్టు కనిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఒక్క సీటు కూడా గెలవకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది.

బీఆర్‌ఎస్ నుంచి పద్మారావు గౌడ్

మరోవైపు బీఆర్‌ఎస్ సికింద్రాబాద్‌లో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో ఏడింటికి 6 సీట్లను గెలుచుకొని ఆత్మవిశ్వాసంతో ఉంది. సికింద్రాబాద్ సిటింగ్ ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఎన్నికల్లో సాధించిన మెజర్టీ వంటి అంశాలతో తాము ఇప్పటికే గెలిచామని పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ యాదవ్‌తో పాటు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారు ఇతర పార్టీల్లో చేరుతుండటం, ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఎంపీ స్థానాన్ని గెలవలేకపోవడం ప్రతికూలాంశాలుగా కనిపిస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img