దేశంలోకరోనా రెండోవేవ్ కేసులు శరవేగంగా పెరిగిపోతున్న తరుణంలో పలు దేశాలు భారత్ నుంచి పర్యాటకుల రాకపై పూర్తి నిషేధం విధించాయి.
భారత్ నుంచి విమానాల రాకనూ నిషేధించాయి. ఆ జాబితాలో అగ్రరాజ్యం అమెరికాతోపాటు బ్రిటన్, కువైట్, ఫ్రాన్స్, కెనడా తదితర దేశాలు ఉన్నాయి.
దేశంలో డబుల్ మ్యూటెంట్ వైరస్ కేసులు ఉన్నాయని పేర్కొంటూ విమానాలను నిషేధించాయి.
తాజాగా ఆ జాబితాలో మాల్దీవుల, జర్మనీ, ఇటలీ, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా తదితర దేశాలు చేరాయి.
తక్షణం భారత్ విమానాలపై నిషేధం అమల్లోకి వస్తుంని ప్రకటించాయి. దాయాది దేశం పాకిస్థాన్, చైనా కూడా భారత్ విమాన సర్వీసులపై నిషేధాజ్ఞలు విధించాయి.
మాల్దీవుల ఇలా
ఇటీవలి కాలంలో భారత్ నుంచి చాలా మంది పర్యాటకులు సందర్శించిన దేశం మాల్దీవుల.
తాజాగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో తక్షణం అంటే ఏప్రిల్ 27వ తేదీ నుంచి భారత్ నుంచి పర్యాటకుల రాకను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తమ దీవుల్లో భారతీయులకు పర్యాటక వసతులు కల్పించకుండా నిలిపేశామని తెలిపింది.
ఇలా జర్మనీ ఆంక్షలు
భారత్ నుంచి పర్యాటకుల రాకపై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.
తమ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు హాని కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి జెన్స్ స్పాహ్న్ తెలిపారు.
భారత్‌లోని తమ జర్మనీ రెసిడెన్సీ అనుమతి మేరకు జర్మనీయులను మాత్రమే అనుమతిస్తున్నట్లు జెన్స్ స్పాహ్న్ చెప్పారు.
వీరు కూడా కొవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించడంతోపాటు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
మే 1 వరకు నెదర్లాండ్స్ నిషేధం
ఈ నెల 26 నుంచి మే ఒకటో తేదీ వరకు భారత్ విమానాలపై నిషేధం కొనసాగుతుందని నెదర్లాండ్స్ తెలిపింది.
భారత్‌తోపాటు 5 దేశాలపై ఫ్రాన్స్ నిషేధం
భారత్‌తోపాటు బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి విమాన సర్వీసులను నిషేధిస్తున్నట్లు ఫ్రాన్స్ తెలిపింది.
ఈ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా యాంటిజెన్ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది.
జర్మనీ బాటలోనే ఇటలీ
జర్మనీ మాదిరిగానే తమ దేశ పౌరులను మాత్రమే భారత్ నుంచి అనుమతినిస్తున్నట్లు ఇటలీ తెలిపింది.
దానికి ముందుగా విమానం బయలుదేరేముందు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
భారత్ నుంచి వచ్చే ఇతర దేశాల పౌరులు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.
పూర్తిగా యూఏఈ నిషేధం
భారత్ నుంచి అన్ని రకాల విమాన సర్వీసులను సస్పెండ్ చేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (యూఏఈ) తెలిపింది.
ప్రతి వారం రెండు దేశాల మధ్య సుమారు 300 సర్వీసులు తిరుగుతుంటాయి.
అయితే యూఏఈ నేషనల్స్, ప్రైవేట్ జెట్ విమానాల ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చింది.
భారత్, పాక్ విమానాలపై కెనడా నిషేధం
భారత్, పాకిస్థాన్‌ల నుంచి 30 రోజులు విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
మరోవైపు ఇప్పటికే 41 దేశాల విమానాలను రద్దు చేసిన ఇరాన్.. ఆ జాబితాలో భారత్, పాకిస్థాన్‌లను కూడా కలిపేసింది.
థాయిలాండ్ అండ్ బంగ్లాదేశ్ కూడా
భారతీయుల విమాన ప్రయాణాలను నిషేధించిన జాబితాలో థాయిలాండ్ కూడా వచ్చి చేరింది.
అలాగే భారత్ నుంచి థాయిలాండేతరుల రాకపోకలను మే ఒకటో తేదీ నుంచి తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నిషేధిస్తున్నట్లు తెలిపింది.
ఈ నెల 26 నుంచి 14 రోజుల వరకు భారత్ విమానాలను బంగ్లాదేశ్ రద్దు చేసింది. 24 నుంచి కువైట్ నిషేధాజ్ఞలు విధించింది.
విదేశీయులకు ఇండోనేషియా నో వీసా
భారతీయులకు వీసాల జారీ నిలిపేయాలని ఇండోనేషియా నిర్ణయించింది. తమ దేశ పౌరులు మాత్రం కొవిడ్ నిబంధనలను పాటిస్తేనే అనుమతినిస్తామని తెలిపింది.
ఈ నెల 23 నుంచి బ్రిటన్ కూడా భారత్ విమానాలను నిషేధించింది. ఎయిర్ ఇండియా ఈ నెల 30 వరకు బ్రిటన్‌కు విమానాలు నడుపబోమని వెల్లడించింది.
ఒమన్ ఇలా
భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ పౌరుల రాకపోకలను అనుమతించబోమని ఒమన్ తెలిపింది. 14 రోజులు ఈ ఆజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొంది.
హాంకాంగ్ వచ్చేనెల 3 వరకు భారత్ విమానాలను రద్దు చేసింది.
సింగపూర్ అన్ని రకాల వీసాలపై బ్యాన్
భారత్‌కు చెందిన వారి అన్ని రకాల వీసాలపై 14 రోజులు నిషేధం విధిస్తున్నట్లు సింగపూర్ తెలిపింది.
ఈ నెల 22 లోపు 14 రోజుల హోం క్వారంటైన్ నిబంధనలు పాటించని వారికి కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.
అమెరికన్లు భారత్‌లో పర్యటించొద్దు
భారతదేశంలో అమెరికన్లు ఎవరూ ప్రయాణించొద్దని ఆ దేశ ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. మలేషియా కూడా భారత్ పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
భారత్‌కు వెళ్లాలనుకుంటే ముందుగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించింది.
ఆస్ట్రేలియా ప్లస్ పాక్ అండ్ దుబాయి నిషేధం
భారత్ ప్రయాణికుల రాకపైనా, భారత నౌకల కదలికలపైనా మలేషియా నిషేధం విధించింది. ఆస్ట్రేలియా, దుబాయి కూడా భారత్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి.
ఇక మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా అదే పని చేసింది. భారత్ విమానాలను నిషేధించిన తొలి దేశం న్యూజిలాండ్.