Homeఫ్లాష్ ఫ్లాష్Troubles in Telangana BJP టీ బీజేపీలో ట్రబుల్స్​

Troubles in Telangana BJP టీ బీజేపీలో ట్రబుల్స్​

– సీనియర్​ నేతలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని అధిష్ఠానం ప్లాన్​
– పార్టీకి బూస్ట్​ వస్తుందని కమలం పార్టీ వ్యూహం
– ససేమిరా అంటున్న లీడర్స్​
– ముఖ్య నాయకులకు ఓటమి భయం
– కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కాషాయపార్టీలో ఇబ్బందులు
– బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని కాంగ్రెస్​ జోరుగా ప్రచారం
– రాష్ట్రంలో పుంజుకుంటున్న హస్తం పార్టీ
– కమలం పార్టీలో మాత్రం రోజుకో పంచాయితీ
– తెలంగాణపైనే ఫోకస్​ పెట్టిన బీజేపీ అధిష్ఠానం
– లిక్కర్​ స్కామ్​ విషయంలోనూ బీజేపీకి తీవ్ర నష్టం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీ ట్రబుల్స్ లో పడింది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని కాషాయపార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందుకు అనుగుణంగానే కొంతకాలం ఆ పార్టీకి పరిస్థితులు కలిసివచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందడం, దుబ్బాక, హుజూరాబాద్​ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి బలం చేకూరింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీకి తామే ప్రత్నామ్నాయం ఆ పార్టీ బలంగా జనంలోకి తీసుకెళ్లింది. చేరికలు సైతం ఆ పార్టీకి బలం చేకూర్చాయి. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీకి తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదురైంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని మార్చడం, లిక్కర్​ స్కామ్​ కేసు వీక్​ కావడం.. కాషాయపార్టీకి తీరని నష్టం తెచ్చిపెట్టాయి. కవిత అరెస్ట్​ తప్పదంటూ తొలుత కొంతమంది బీజేపీ లీడర్స్​ బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఈ కేసు వీక్​ కావడం తెలిసిందే. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనని కాంగ్రెస్​ జోరుగా ప్రచారం చేసింది. దీంతో కాషాయపార్టీ కష్టాల్లో పడింది. ప్రస్తుతం ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. అందుకనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన సీనియర్​ లీడర్లను ఎమ్మెల్యేగా పోటీచేయించాలని బీజేపీ ఎత్తులు వేసింది. అయితే అందుకు సీనియర్​ నేతలు ససేమిరా అంటున్నట్టు సమాచారం. అందుకు ప్రధాన కారణం.. ఒక వేళ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రభావం ఎంపీ ఎన్నికల్లో కూడా ఉంటుంది కాబట్టి.. మరింత నష్టపోతామని బీజేపీ సీనియర్​ నేతలు భావిస్తున్నారట. ఇటీవల బీజేపీ సైతం అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే సీనియర్​ నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో అధిష్ఠానం ఆశ్చర్యపోయిందట.

కాషాయ పార్టీలో రోజుకో పంచాయితీ..
గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్​పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఆ పార్టీలోని లీడర్లు ఎవరికి వారు సొంత గ్రూపు ఏర్పాటు చేసుకుంటారు. నిత్యం సొంతపార్టీ లీడర్ల మీదే కాంగ్రెస్​ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితి బీజేపీలో కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ మాత్రం కమశిక్షణగా ఉంటే.. బీజేపీలో నిత్యం గ్రూపు తగాదాలు నడుస్తున్నాయి. మరోవైపు అధిష్ఠానం మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో సీరియస్​ గా తీసుకున్నది. ఇక్కడ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తోంది. సీనియర్​ నాయకులు మాత్రం స్పందించడం లేదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీ తెలంగాణ స్టేట్​ ను సౌత్​ ఇండియాకు గేట్​ వేగా భావిస్తున్నాయి. ఇక్కడ గెలవడం ద్వారా సౌత్​ లో గట్టిగా పాగా వేయొచ్చని భావిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నార్త్​ ఇండియా ప్రభావం చూపించే చాన్స్​ ఉంది. దీంతో ఈ స్టేట్​ పై కాషాయపార్టీ ఎక్కువ ఫోకస్​ పెట్టింది.

సీనియర్​ లీడర్లకు ఓటమి భయం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్​ కొంత మేర గ్రాఫ్​ డౌన్​ అయ్యిందని చెప్పకతప్పదు. కానీ ఈ స్టేట్​ పై బీజేపీ కూడా బలంగా ఫోకస్​ పెట్టింది. బీజేపీ అనుబంధ సంఘాలు పార్టీని గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కొంతమంది టాప్​ లీడర్స్​ను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా బరిలో దించాలని అధిష్ఠానం ఎత్తులు వేస్తోంది. అందుకనుగుణంగానే వ్యూహాలు రచించింది. అయితే సీనియర్​ లీడర్లు ఎవరూ పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. కిషన్​ రెడ్డి, లక్ష్మణ్​, బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ లాంటి లీడర్లను ఎమ్మెల్యే బరిలో దించాలని బీజేపీ భావిస్తోంది. కానీ వాళ్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. మరోవైపు తాము ఎమ్మెల్యేలుగా ఓడిపోతే .. ఆయా లోక్ సభ ఎన్నికల్లో ప్రభావం పడబోతుందని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాము రెంటికి చెడ్డ రేవడి అవుతామని బీజేపీ సీనియర్​ నేతలు భావిస్తున్నారని టాక్​.

చేరికలు నిల్​.. జంపింగ్​ లే ఎక్కువ
మరోవైపు కాషాయపార్టీలో చేరికలు పెద్దగా కనిపించడం లేదు. పైగా కొంతమంది నేతలు త్వరలో పార్టీ మారబోయే అవకాశం ఉందని సమాచారం. అయితే గతంలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొందరు లీడర్లు ఆ తర్వాత ఎంపీలుగా గెలుపొందారు. కానీ అప్పుడు రాజకీయపరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. అప్పుడు బండి సంజయ్​, ధర్మపురి అర్వింద్​ లాంటి లీడర్స్​ మీద వేరే ప్రభావాలు చూపించాయి. కరీంనగర్​ లో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్​ మొత్తం బూమరాంగ్​ అయ్యాయి. సీఎం కేసీఆర్​ 2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో హిందుగాళ్లు, బొందుగాళ్లు అంటూ కామెంట్స్​ చేశారు. ఈ వ్యాఖ్యలు ఉత్తరతెలంగాణలో మొత్తం ప్రభావం చూపాయి. బీజేపీకి చెందిన ఎంపీలు గెలిచారు. అప్పుడు అధికార బీఆర్ఎస్​.. బీజేపీ మధ్య గట్టి ఫైట్​ నడిచింది. దీంతో బీజేపీ ప్రభావం చూపగలిగింది. కానీ ప్రస్తుతం బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటేనన్న ప్రచారం బలంగా జనంలోకి వెళ్లింది. కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకొని బీఆర్ఎస్​ కు తామే అసలైన ప్రత్నామ్నాయం అని సవాల్​ విసురుతోంది. దీంతో బీజేపీ ముఖ్యనేతలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు బయపడుతున్నట్టు సమాచారం. మరి ఎన్నికల నాటికి బీజేపీ ఏమైనా పుంజుకుంటుందా? సీనియర్​ లీడర్లు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతారా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img