Homeఫ్లాష్ ఫ్లాష్మొద‌టి ఒక వ్యాక్సిన్​, రెండో డోస్ ఇంకో వ్యాక్సిన్​ తీసుకోవ‌చ్చా?

మొద‌టి ఒక వ్యాక్సిన్​, రెండో డోస్ ఇంకో వ్యాక్సిన్​ తీసుకోవ‌చ్చా?

Vaccine Doubts | క‌రోనా ( coronavirus ) మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తోంది !! సెకండ్ వేవ్‌ ( second wave )లో చిన్నాపెద్దా తేడా లేకుండా అంద‌రూ కొవిడ్‌-19 ( Covid-19 ) బారిన ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో మాస్కులు ధ‌రిస్తూ సామాజిక దూరం పాటిస్తేనే స‌రిపోదు. వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. అప్పుడే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోగ‌లం.

ఈ ఉద్దేశంతోనే 18 ఏళ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సిద్ద‌మ‌య్యాయి.

కానీ వ్యాక్సిన్ తీసుకోవాలంటే జ‌నాల్లో ఏదో తెలియ‌ని భ‌యం !! ఇంకా ఎన్నో అనుమానాలు!! మ‌నం వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చా? లేదా? టీకా తీసుకుంటే ఏమ‌వుతుందో? రెండు డోసులు ఎందుకు? ఒక్క డోస్ తీసుకుంటే స‌రిపోదా? ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న వ్యాక్సిన్ల‌లో ఏది మంచిది? ఇలా ఎన్నో సందేహాలు ( Vaccine Doubts ) ఉన్నాయి.

ఇలా చాలా మందిలో ఉన్న సందేహాలు, వాటికి స‌మాధానాలు మీకోసం..

కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లో ఏది మంచిది?

మ‌న దేశంలో ప్ర‌స్తుతం రెండు వ్యాక్సిన్ల‌ను అందిస్తున్నారు. ఇందులో మ‌న‌కు న‌చ్చిన వ్యాక్సిన్‌ను ఎంచుకునేందుకు అవ‌కాశం లేదు. టీకా కేంద్రాల్లో ఏది అందుబాటులో ఉంటే అది వేస్తున్నారు.

అయితే ఇందులో ఒక‌టి మంచిది, ఇంకోటి కాదు అని ఏమీ లేదు.

ఇవి రెండూ కూడా క‌రోనా వైర‌స్‌పై స‌మ‌ర్థంగా ప‌నిచేస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. అందువ‌ల్ల రెండింటిలో ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవ‌చ్చు.

కోవాగ్జిన్ ఇన్‌యాక్టివేటెడ్ ప్లాట్‌ఫాంపై త‌యారైంది. కోవిషీల్డ్ వైర‌ల్ వెక్ట‌ర్ ప్లాట్‌ఫాంపై ఆధార‌ప‌డి ఉంటుంది.

అందువ‌ల్ల రెండు టీకాల‌ను క‌లిపి తీసుకోవ‌డం మంచిది కాదు. క‌రోనావైర‌స్‌ను ఎదుర్కొనేందుకు రెండు డోసుల్లోనూ ఏదో ఒక వ్యాక్సిన్‌ను మాత్ర‌మే తీసుకోవాలి.

క‌రోనా బారిన ప‌డి కోలుకుంటే వ్యాక్సిన్ అవ‌స‌ర‌మా?

గ‌తంలో క‌రోనా బారిన ప‌డిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. దీనివ‌ల్ల యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉత్ప‌త్తి అవుతాయి.

దీనివ‌ల్ల మ‌ళ్లీ వైర‌స్ సోకే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత క‌రోనా వ‌స్తే ఎలా?

క‌రోనా నుంచి కోలుకున్న రెండు వారాల‌కు రెండో డోస్ తీసుకోవ‌చ్చు.

అదే మొద‌టి డోస్ తీసుకోక‌ముందు క‌రోనా వ‌స్తే.. రిక‌వ‌రీ అయినా 28 రోజుల త‌ర్వాత‌నే వ్యాక్సిన్ వేసుకోవాలి.

రెండు డోసులు తీసుకునే వ‌ర‌కు ప్ర‌త్యేక‌మైన డైట్ ఫాలో అవ్వాలా?

క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకునేంత వ‌ర‌కు ఎలాంటి ప్ర‌త్యేక‌మైన‌ డైట్ ఫాలో అవ్వాల్సిన అవ‌స‌రం లేదు.

ఎప్పుడూ తీసుకునే ఆహార‌మే తీసుకోవాలి. ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌టం మంచిది.

28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం కుద‌ర‌క‌పోతే ఎలా?

మొద‌టి డోస్ తీసుకున్న త‌ర్వాత ఒక్కోసారి 28 రోజుల్లో రెండో డోస్ తీసుకోవ‌డం సాధ్యం కాక‌పోవ‌చ్చు.

దానివ‌ల్ల ఇబ్బందేమీ లేదు. కాక‌పోతే 6 నుంచి 8 వారాల్లోపు క‌చ్చితంగా రెండో డోస్ తీసుకోవాలి. అప్పుడే ఫ‌లితం ఉంటుంది.

గ‌ర్భిణులు, బాలింత‌లు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

ప్ర‌స్తుతం మ‌న దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను గ‌ర్భిణులు, పిల్ల‌ల‌పై చేయ‌లేదు.

కాబ‌ట్టి గ‌ర్భిణులు, బాలింత‌లు, పిల్ల‌లు వ్యాక్సిన్లు తీసుకోవ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఎలాంటి సిఫార‌సులు చేయ‌లేదు.

దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు మెడిసిన్ ఆపేయాలా?

క‌రోనా వ్యాక్సిన్‌పై ఇత‌ర మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ చూపించ‌వు.

కాబ‌ట్టి బీపీ, షుగ‌ర్ వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌కు మందులు వాడే వారు నిర‌భ్యంతరంగా వాటిని వేసుకోవ‌చ్చు.

థైరాయిడ్ పేషెంట్లు టీకా తీసుకోవ‌చ్చా?

థైరాయిడ్ పేషెంట్లు నిర‌భ్యంత‌రంగా టీకా తీసుకోవ‌చ్చు. దానివ‌ల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.

వ్యాక్సినేష‌న్ ముందు క‌రోనా టెస్ట్ చేయించుకోవాలా?

క‌రోనా వ్యాక్సిన్ వేసే ముందు భార‌త్‌లోనే కాదు ప్ర‌పంచంలో ఎక్క‌డా కొవిడ్‌-19 టెస్ట్ చేయ‌డం లేదు.

అయితే క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు అనిపిస్తే మాత్రం టెస్ట్ చేయించుకోవాలి.

వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తాయి?

ఏ టీకా తీసుకున్నా కొన్ని దుష్ప్ర‌భ‌వాలు ఉంటాయి. కొవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత కొంత‌మందికి ఒళ్లు నొప్పులు, తేలిక‌పాటి జ్వ‌రం, అల‌స‌ట‌, త‌ల‌నొప్పి, కీళ్లనొప్పులు వంటివి రావ‌చ్చు.

కానీ ఇవ‌న్నీ రెండు నుంచి మూడు రోజుల్లో త‌గ్గిపోతాయి. కాబ‌ట్టి వీటి విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

రెండు డోసులు తీసుకుంటే మాస్క్ వాడ‌క్క‌ర్లేదా?

రెండు డోసుల వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా అంద‌రూ క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల్సిందే.

టీకా తీసుకున్న వారికి కూడా క‌రోనా సోకే అవకాశం ఉంటుంది. కానీ దాని తీవ్ర‌త అంత ఎక్కువ‌గా ఉండ‌దు.

అయితే వీరి ద్వారా ఇత‌రుల‌కు వైర‌స్ సంక్ర‌మించే అవకాశం మాత్రం ఎప్ప‌టిలాగే ఉంటుంది. కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించాలి.

Recent

- Advertisment -spot_img