డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ..హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ వద్ద నిరుద్యోగుల తీవ్ర ఆందోళనలు చేపట్టారు. దీంతో సెక్రటేరియట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగులు, అభ్యర్థులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని గత కొంత కాలంగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న డీఎస్సీ నోటిషికేషన్‌ను రద్దు చేసి అదనంగా మరో 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ వేయాలని నిరుద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. గ్రూప్స్ అభ్యర్థులను 1:100 రేషియోలో క్వాలిఫై చేయాలని, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీసీ సంఘం, AISF నాయకులు.. సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత పెద్ద పోలీసు బలగాలు మోహరించినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎవరు అడ్డొచ్చినా సరే సెక్రటేరియట్ ముట్టడి చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు.