Homeజిల్లా వార్తలుపాపం గుంపుమేస్త్రీ.. అనుభవలేమితో అయోమయం

పాపం గుంపుమేస్త్రీ.. అనుభవలేమితో అయోమయం

 • కాంగ్రెస్​ సర్కారులో మినిస్టర్లదేపై చేయి
 • ముఖ్యమంత్రికి తెలియకుండానే నిర్ణయాలు
 • అందరినీ సంతృప్తి పరుస్తూ ముందుకు సాగుతున్న సీఎం
 • ఇదే తమ పార్టీలో ప్రజాస్వామ్యం అంటూ ఆత్మవంచన
 • ఎంపీ ఎన్నికల తర్వాత మరింత బలహీనమైన రేవంత్​
 • రేవంత్​ పనితీరుపై అధిష్ఠానం అసంతృప్తి !
 • మంత్రివర్గ విస్తరణ చేసుకొలేని అసహాయత
 • కార్పొరేషన్ పదువులు కట్టబెట్టలేని దుస్థితి
 • అన్నింటా అధిష్ఠానం జోక్యమే..
 • పలు జిల్లాల్లో మంత్రుల మీద అవినీతి ఆరోపణలు
 • వారిని పిలిచి గట్టిగా వారించలేని స్థితిలో సీఎం
 • రైతు బంధు విషయంలో మంత్రుల తలా ఓ మాట
 • సీఎం క్యాంప్​ విషయంలో తీవ్ర గందరగోళం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ‘ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రీ లాంటి పోస్ట్​.. అందరితో పనిచేయించుకోవడం తెలిస్తే చాలు’ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అనేక ఇంటర్వ్యూలలో సీఎం రేవంత్ చెప్పిన మాట ఇది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో తాను ఇదే మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన ప్రకటించుకున్నారు కూడా.. అయితే ఇప్పుడు రేవంత్ కు ఈ గుంపు మేస్త్రీ పని కత్తిమీద సాములాగా అయినట్టు కనిపిస్తోంది. నిజానికి తన కింద పనిచేసే కూలీలంతా చెప్పినట్టు వింటే.. గుంపు మేస్త్రీకి పని చాలా సులభం అవుతుంది. కానీ ఎవరూ మాట వినకపోతే అప్పుడు నరకమే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉన్నట్టు కనిపిస్తోంది. అన్ని శాఖల మీద ఆయనకు పూర్తి స్థాయిలో ఉందా? అంటే డౌటే. ఓ వైపు అధిష్ఠానం ఒత్తిడి.. మరోవైపు సీనియర్​ లీడర్ల ను బుజ్జగించడంతో రేవంత్ ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సమన్వయం లేదని.. సీఎంకు అన్ని శాఖల మీద పూర్తి పట్టు లేదని అనేక సందర్భాల్లో రుజువయ్యింది కూడా. కాంగ్రెస్​ పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చిన అత్యంత కీలకమైన హామీల్లో రైతు బంధు కూడా ఒకటి. ఆ హామీ మీదే మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం గమనార్హం. సహజంగా విధానపరమైన నిర్ణయాల విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడటం సబబుగా ఉంటుంది. కానీ అలా కాకుండా మంత్రులు రంగంలోకి దిగిపోయి ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడటంతో అంతా గందరగోళంగా మారిపోయింది. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని మంత్రి కోమటిరెడ్డి అనడం.. భూస్వాములకు ఇచ్చే రైతు బంధు కోసం ఎందుకంత ఆరాటం అంటూ సీతక్క నోరు పారేసుకోవడం.. అసలు తనకు రైతు బంధు ఇంకా రాలేదంటూ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల వాపోవడం తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఇక నిరుద్యోగ భృతి ఇస్తామని సాక్షాత్తు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ హామీ ఇస్తే.. అసలు మేం ఆ మాటే ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి చెప్పడం గమనార్హం.

ఎవరు సీఎం?
గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ది వన్​ మ్యాన్​ షో. అక్కడ కేటీఆర్​, హరీశ్ లాంటి ఒకరిద్దరు మంత్రులను మినహాయిస్తే మిగతా వారందరూ డమ్మీలే. కేసీఆర్​ చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. వివిధ శాఖల మీద మాత్రమే కాదు మొత్తం రాష్ట్రం మీద ఆయనకున్న అవగాహన అటువంటిది. అందుకే ఏ శాఖ విషయంలోనైనా .. ఏ అంశం గురించైనా కేసీఆర్​ సాధికారికంగా మాట్లాడేవారు. మొత్తం రాష్ట్రాన్ని సింగిల్​ హ్యాండ్ తో నడిపించారు. తద్వారా అన్ని శాఖల్లోనూ అభివృద్ధి ఉరుకులు పరుగులు పెట్టింది. నిర్ణయాల్లో వేగం కచ్చితత్వం కనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సీఎం ఒకటి తలిస్తే.. మంత్రులు మరోటి చేస్తారు. ముఖ్యమంత్రి తన సమావేశాల్లో నిత్యం.. తన తోటి కేబినెట్ మంత్రులు ఏ మాత్రం నొచ్చుకోకుండా పనిచేయాల్సి వస్తోంది. వెరసి ఆ ఎఫెక్ట్ పాలన మీద పడుతోంది.

క్యాంప్​ ఆఫీస్​ ఏది?
అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి క్యాంప్​ ఆఫీస్​ ఏది? అన్న ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం గత సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​ ను నిర్మించారు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కేబినెట్ మీటింగ్​ లకు .. విదేశీ ప్రతినిధులతో భేటీలకు అనువుగా భవనం నిర్మించారు. కానీ విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ ప్రగతి భవన్​ ను ఆడిపోసుకున్నారు కాబట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక దాని జోలికి వెళ్లలేదు. మరి అటువంటప్పుడు ఆ భవంతిని ఆస్పత్రిగానో.. ఇతర ప్రజా ప్రయోజనం కోసమే వినియోగించారా? అంటే అదీ లేదు. తన సహచర మంత్రులకే కేటాయించారు. దీంతో పలు విమర్శలు వస్తున్నాయి. ఇక ఉన్న ప్రగతి భవన్​ ను వద్దనుకున్న సీఎం.. తన క్యాంప్ ఆఫీసుకోసం పట్నం మొత్తం తిరిగారు. ఎంసీహెచ్ ఆర్డీ బిల్డింగ్ లో పెడతానన్నారు. నిజాం కాలం నాటి ‘పైగా’ ప్యాలెస్​ అన్నారు. రాజ్ భవన్​ సమీపంలో ఉన్న మరో భవంతిలో క్యాంప్​ ఆఫీస్​ ఏర్పాటు చేసుకుంటున్నానన్నారు.. కానీ ఎక్కడ కుదరలేదు. వెరసి ధనిక రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అధికారిక నివాస గృహమే లేకుండా పోయింది.

అధికారుల విషయంలో ..
బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ధరణి ఆరాచకాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, నవీన్ మిట్టల్ ఆధ్యులు, బాధ్యులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరిద్దరి మీద నిప్పులు కక్కిన రేవంత్​ ముఖ్యమంత్రి అయ్యాక పెద్దగా మాట్లాడటం లేదు. పైగా నవీన్ మిట్టల్ ని కనీసం బదిలీ కూడా చేయకుండా అదే స్థానంలో మరింత బలాన్నిచ్చి కొనసాగించడం దొంగకు తాళం చేయిచ్చినట్టుగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. రేవంత్ ను వాళ్ళు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. బీఆర్ఎస్​ హయాంలో చక్రం తిప్పి ఏకంగా తన మీదనే పరువు నష్టం దావ వేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ లో అడ్డంగా దొరికినా ఈ రోజు వరకు టచ్​ చేయకపోవడాన్ని బట్టి చూస్తే రేవంత్ కోరలు లేని పామే అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇక పొతే ఫోన్ ట్యాపింగ్​ అంటూ రోజుకో లీకు ఇచ్చి సంచలనానికి తెర లేపిన పోలీస్ బాస్​ లు నోరుమెదపలేని కొంతమంది పోలీస్ అధికారులను జైల్లో పెట్టారు. వాంగ్మూలాలు మీడియాకు విడుదల చేశారు కానీ.. రాజకీయ నాయకులను కనీసం పిలిచి విచారణ చేయలేదు. మరీ ముఖ్యంగా ప్రధాన పాత్రధారిగా ఉన్న మాజీ కలెక్టర్ బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు నిందితులు చెప్పినప్పటికి ఆయన్ని విచారించే దైర్యం చేయకపోవడం గమనార్హం. వెంకట్రాంరెడ్డి మీద ఈగ వాలినా ఆయన వియ్యంకుడు మంత్రి శ్రీనివాస్ రెడ్డి కోపానికి గురికావాల్సి వస్తుందని రేవంత్ భయపడ్తున్నాడని ఓపెన్ టాక్. దీనితో ట్యాపింగ్​ కేసు నీరుగారిపోయిందన్నది జగనెరిగిన సత్యం. ఇలా చెప్పుకుంటూ పొతే చాలా ఉన్నాయి. మొత్తం మీద రేవంత్ ఉట్టి ఉత్తర కుమారుడే అన్నది జనాలకి తెల్సి పోయింది.

ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోతాయా?
ఇక గత ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్ర వేశారు. అడుగడుగునా ఆయన మార్క్​ కనిపించేలా పాలన కొనసాగించారు. కట్టడాలు నిర్మించారు. కానీ ఇప్పుడు ఆ ఆనవాళ్లు తుడిచేద్దామంటూ రేవంత్ పూనుకున్నారు. అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ పని సాధ్యం అవ్వడం లేదు. అందుకే ఆయన సచివాలయంలో కూర్చొని సమీక్ష చేస్తున్నా.. పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ లో కూర్చొని ఆదేశాలు ఇస్తున్నా అక్కడ కేసీఆర్​ కనిపిస్తున్నట్టు ఉంది. అందుకే రేవంత్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఎంపీ ఎన్నికల తర్వాత డౌన్
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ హైకమాండ్ ఆశించినన్నీ సీట్లు గెలిస్తే రేవంత్ మాట హైకమాండ్ వద్ద చెల్లుబాటు అయ్యేది. కానీ కేవలం తక్కువ సయమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వ్యతిరేకతను చవి చూసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ సీట్లు రావడం ఒక ఎత్తైతే రేవంత్ సొంత జిల్లాలోని మహబూబ్​ నగర్​, ఇటు ఆయన ఆయన సొంత సిట్టింగ్ సీటు మల్కాజిగిరి, పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్న చేవెళ్ల మూడు పోయాయి. దీంతో అధిష్ఠానం దగ్గర ఇజ్జత్ పోగొట్టుకుంటున్నాడు రేవంత్​.

అడుగడుగునా అడ్డం పడుతున్న భట్టి ..
రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మధ్య కూడా పొసగడం లేదు. ఇది మొదటి నుంచే ఉన్నదే. ఇద్దరూ సీఎం సీటు కోసం పోటీ పడితే రేవంత్ ను పదవి వరించింది. దీంతో సహజంగానే ఇద్దరిలో అభిప్రాయబేధాలు ఉండటం సహజం. దీంతో ఇద్దరు లీడర్ల మధ్య కోల్డ్​ వార్​ సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్​ హైకమాండ్ అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ భట్టికి ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గానికి డబ్బులు కావాలన్నా భట్టిని అడగాల్సిన పరిస్థితి.

ఓఎస్డీల మాటేమిటి?
చాలా మంది అధికారులు ఏండ్ల తరబడి వివిధ శాఖల్లో పాతుకుపోయారని.. వారి పదవీకాలం పూర్తయినా ఓఎస్డీల కింద తిష్ఠ వేశారని రేవంతే విమర్శించారు. ఆయన పవర్​ లోకి వచ్చాక వారి లెక్క తీశారు. తీసేయబోతున్నామని కూడా లీకులు ఇచ్చారు. ఇప్పటివరకు ఒక్కరిని కూడా తీసేయలేదు. పైగా తన హాయంలోనూ కొందరు అధికారుల పదవీకాలం పూర్తయినా వివిధ శాఖల్లో కొనసాగిస్తుండటం గమనార్హం.

పవర్​ కట్స్​.. అధికారుల తప్పిదమా?
ఇక రాష్ట్రంలో పవర్​ కట్​ ఎలా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు చోట్ల విద్యుత్ అంతరాయాలు కలుగుతూనే ఉన్నాయి. అయితే పవర్​ కట్స్​ ఎందుకు జరుగుతున్నాయో ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించకుండా.. అందుకు బీఆర్ఎస్​ పార్టీనే తిడుతున్నారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన లైన్​ మన్లు, విద్యుత్​ శాఖ అధికారులు పవర్​ కట్​ చేస్తున్నారని రేవంత్ ఆరోపించడం గమనార్హం. ఇక ఇటువంటి అనేక ప్రతికూలాంశాలు.. అధిష్ఠానం ఒత్తిడి.. స్వపక్షం విమర్శలు.. అసంతృప్తులు, అలకల నడుమ ముఖ్యమంత్రి పాలన కొనసాగిస్తున్నారు. మరి ఇటువంటి పాలన తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేలు చేకూరుస్తోంది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img