దేశంలో మే 1 నుంచి మూడో విడత కరోనా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నారు.
ఈ విడతలో 18 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తారు.
మూడో విడతలో టీకా డోసులు తీసుకునే వారు తమ వివరాలను ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి.
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ సాయంత్రం 4 గంటలకు దేశవ్యాప్తంగా ప్రారంభమైంది.
అర్హులైన వారు కొవిన్ పోర్టల్ తో పాటు ఆరోగ్య సేతు యాప్, ఉమంగ్ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లో తమ వివరాలు నమోదు చేసుకుని టీకాలు పొందవచ్చని కేంద్రం తెలిపింది.
ఆన్ లైన్ లో మొబైల్ ఫోన్ నెంబరు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
ఒక లాగిన్ తో నలుగురు రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించింది.
వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీని నివారించేందుకే ముందస్తు రిజిస్ట్రేషన్ విధానం తీసుకువచ్చినట్టు వివరించింది.
కాగా, తాజా సమాచారం ప్రకారం ఆన్ లైన్ లో భారీ ట్రాఫిక్ కారణంగా కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు యాప్ ల కార్యకలాపాలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ఒక్కసారిగా అత్యధిక సంఖ్యలో ప్రజలు రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించడంతో సర్వర్లు మొరాయించినట్టు భావిస్తున్నారు.