Homeహైదరాబాద్latest Newsపడకేస్తున్న ప్రత్యేక పాలన

పడకేస్తున్న ప్రత్యేక పాలన

Khammam : పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఓవైపు గ్రామాల్లో ప్రజలు సమస్యలతో ఇక్కట్లు పడుతుంటే ప్రత్యేక అధికారులు మాత్రం పల్లెలకు చుట్టపుచూపుగా వస్తున్నారు. పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడటం వంటి సమస్యలతో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 589, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామపంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు శ్రీకారం చుట్టింది. పెద్ద పంచాయతీలకు మండల అధికారులు, చిన్న పంచాయతీలకు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించి పాలన సాగిస్తున్నారు. మండల అధికారుల్లో చాలామందికి 3,4 గ్రామపంచాయతీలు కేటాయించగా వాటి పర్యవేక్షణ రోజూవారీగా సాధ్యం కావడం లేదు. వారివారి విధులతోనే అధికారులంతా తలలు పట్టుకుంటుంటే ఇటీవల లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో వారికి ఎన్నికల విధులు తోడయ్యాయి. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేక గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని, ఫలితంగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోజూవారి విధుల్లో అధికారులు తీరిక లేకుండా ఉండటంతో పల్లె పర్యవేక్షణకు రావడం లేదని చెబుతున్నారు. గ్రామాల్లోని సమస్యలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img