Homeరాజకీయాలుమధ్యప్రదేశ్​లో 150 సీట్లు గెలుస్తం : Rahul Gandhi

మధ్యప్రదేశ్​లో 150 సీట్లు గెలుస్తం : Rahul Gandhi

– కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
– బీజేపీ పాలనపై విమర్శలు


ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం విదిశలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొని బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. 2020లో కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చి వేసిన అంశాన్ని ప్రస్తావించారు. ఈసారి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అనుకూల తుపాను రాబోతోందని.. తమ పార్టీ 145 నుంచి 150 సీట్లు గెలుచుకోవడం ఖాయమని రాహుల్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ఐదేళ్ల క్రితం ఎన్నికైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా కూల్చివేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న 15 మాసాల్లోనే 27లక్షల మంది రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసిందని రాహుల్‌ అన్నారు. కానీ, తమ ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారం చేపట్టిన బీజేపీ మాత్రం కార్మికులు, రైతులు, చిన్న వ్యాపారులు, నిరుద్యోగులను మోసం చేసిందని విరుచుకుపడ్డారు. కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ పార్టీ ద్వేషంతో కాకుండా ప్రేమతో బీజేపీని ఓడించిందన్నారు. కర్ణాటకలో బీజేపీ 40శాతం కమీషన్‌తో ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో పేదల జేబుల నుంచి బీజేపీ లాక్కున్న డబ్బును తిరిగి ఇవ్వాలని కర్ణాటక సీఎంకు తాను చెప్పానన్నారు. సంపన్నులకు భాజపా ఇచ్చిన డబ్బును తిరిగి పేదలకు ఇచ్చేయాలని చెప్పినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్‌ రూ.1200 నుంచి రూ.1400లుగా ఉంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లలో మాత్రం రూ.500కే ఇస్తున్నట్లు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హమీలను అమలు చేస్తోందన్నారు. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోందని రాహుల్‌ చెప్పారు. మొత్తం 230 సీట్లు కలిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి నవంబర్‌ 17న పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img