Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఉక్కపోత

వామ్మో.. ఉక్కపోత

అధికారిక కార్యక్రమంలో పవర్ కట్

40 నిమిషాలు చుక్కలు చూసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, అధికారులు

విద్యుత్ అధికారులు ఫోన్ చేసినా.. నో రెస్పాన్స్

కార్యక్రమం మొదలుపెట్టే సమయానికి వచ్చిన కరెంట్

జగిత్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఘటన

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కరెంట్ కోతలు ప్రజలనే కాదు.. అధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా చుక్కలు చూపిస్తుంది. అందుకు జగిత్యాల రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. శనివారం కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా కరెంట్ పోయింది. దాదాపు 40 నిమిషాల పాటు లబ్ధిదారులతో పాటు అధికారులంతా కరెంట్ లేక చుక్కలు చూడాల్సి వచ్చింది. సమావేశం ప్రారంభం సమయం వరకు కరెంట్‌ రాకపోవడంతో తహశీల్దార్‌ విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ చేశారు. అయినా కరెంట్‌ అధికారులు స్పందించలేదు. విధిలేని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ జీవన్‌‌రెడ్డి స్వయంగా కల్పించుకొని పలుమార్లు విద్యుత్‌ అధికారులకు ఫోన్‌ చేసి కరెంట్‌ సరఫరాను పునరుద్ధరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయినా కరెంట్‌ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కరెంట్‌ లేకుండానే, ఉక్కపోతలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 40 నిమిషాల తర్వాత కరెంట్ రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటిదాకా అందరూ ఉక్కపోతతో తిప్పలు పడ్డారు.

Recent

- Advertisment -spot_img