విశాఖపట్నంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడు ముళ్లు వేసిన భార్యను వదిలేసి పరాయి స్త్రీతో సంసారం పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. తన భర్త వేరే మహిళతో ఉండగా.. భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ భార్య ఎవరో కాదు మిస్ వైజాగ్‌గా ఎంపికైన నక్షత్ర. వివరాలలోకి వెళ్తే.. నక్షత్ర 11 ఏళ్ల క్రితం అనగా 2013లో తేజ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అతడు నేవీలో పనిచేసేవాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత.. పెద్దల అంగీకారంతో 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నారు. ఆ తర్వాత తేజ నిజస్వరూపం బయటపడింది. వేరే మహిళలతో సంబంధం పెట్టుకున్నాడు. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. నేవీ అధికారులు అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఇలా ఉండగా.. తేజ మరో మహిళతో హోటల్ రూమ్‌లో ఉండగా.. అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది అతడి భార్య, మిస్ వైజాగ్ నక్షత్ర. ఇక తేజతో ఉన్న మహిళ.. ఓ రాజకీయ నాయకుడి కుమార్తె అని ఆరోపించింది. ఇక తేజ తనకు విడాకులు ఇవ్వకుండానే.. మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపింది. పబ్జి గేమ్ ద్వారా ఆడవాళ్లను ట్రాప్ చేసి.. వారిని మోసం చేసి లోబర్చుకుని.. తన కోరికలు తీర్చుకుంటాడని చెప్పుకొచ్చింది. అక్క వరసయ్యే మహిళను కూడా వదల్లేదని నక్షత్ర ఆరోపించింది. ఇప్పుడు కూడా మరో మహిళతో ఉన్నట్లు సమాచారం రావడంతో.. అక్కడకు వెళ్లి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
నక్షత్రను అక్కడ చూసిన ఆమె భర్త తేజ షాక్ అయ్యాడు. ఆమె వెంట మీడియా రావడం చూసి కంగారు పడ్డాడు. మరో మహిళతో ఉండటం చూసి.. ఇదేంటని ప్రశ్నించగా.. అతడు ఆమె మీద దాడి చేశాడు. జుట్టు పట్టి బయటకు లాగాడు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ.. పెళ్లైన కొద్ది కాలానికే తన భర్త.. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపింది. తేజకు ఇతర మహిళలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని.. ఆఖరికి సొంత పెద్దమ్మ కుమార్తెని కూడా వదలడం లేదని ఆరోపించింది.
తనకు ఓ కుమార్తె ఉందని.. పాప కోసం తాను అతడు చేసిన దారుణాలు భరిస్తున్నానని.. అయినా మారడం లేదని.. ఇప్పుడు ఏకంగా మరో మహిళను పెళ్లి చేసుకుని.. కాపురం పెట్టాడని చెప్పుకొచ్చింది నక్షత్ర. ప్రస్తుతం తేజ ఏం పని చేయడం లేదని తెలిపింది. అతడు చేసే పనుల గురించి ప్రశ్నిస్తే.. తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని.. దారుణంగా కొట్టాడని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాళ్లను అసలు వదలకూడదన్నది. రెండేళ్ల క్రితమే తేజ మీద తాను దిశలో ఫిర్యాదు చేశానని.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.