Homeహైదరాబాద్latest Newsభారత్‌లో ఎవరు గెలుస్తారో? ప్రపంచం చూపంతా మనవైపే!

భారత్‌లో ఎవరు గెలుస్తారో? ప్రపంచం చూపంతా మనవైపే!

దేశంలో జరుగుతున్న సార్వత్రిక సంగ్రామ పరిణామాలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తితో గమనిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదల, అంతర్జాతీయ వేదికలపై భారత్ తన గొంతును బలంగా వినిపించడం వంటి అంశాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ప్రత్యేకించి విదేశీ మీడియా ఫోకస్ ఎక్కవైంది. ఎన్నికల వ్యూహం, ప్రచారం, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సీఎన్ఎన్, బీబీసీ, ఫ్రాన్స్ 24, అల్‌జజీరా, గ్లోబల్ టైమ్స్ వంటి దిగ్గజ మీడియా సంస్థలు పోటాపోటీగా కథనాలు ప్రచురించాయి. ఫలితాల కోసం ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సీఎన్ఎన్

భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ అసమానతలు పెరిగాయని సీఎన్ఎన్ కథనాలు రాసింది. ఎన్నికల ప్రచారంలో మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు, విపక్షాల స్పందనలను విశ్లేషించింది.

వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్

బీజేపీకి పశ్చిమ బెంగాల్‌లో వస్తోన్న ఆదరణపై వాషింగ్టన్ పోస్టు వార్తలు రాసింది. మోదీ బలాలు, ప్రజల అభిప్రాయం, ఎగ్జిట్ పోల్స్ వంటి అంశాలపై న్యూయార్క్ టైమ్స్ కథనాలు రాసింది.

బీబీసీ

మోదీ పాపులారిటీ వెనుక అమిత్ షా వ్యూహాలు, ఇండియా ఎకానమీ గ్రోత్ వంటి అంశాలపై బ్రిటీష్ మీడియా బీబీసీ వరుస కథనాలు రాసింది.

ఫ్రాన్స్ 24

దశాబ్ది కాలంపాటు అధికారంలో ఉన్న మోదీ పాలనకు తాజా ఎన్నికలు రెఫరెండంగా భావించవచ్చని ఫ్రాన్స్24 అభివర్ణించింది.

అల్‌జజీరా

ముస్లింల అణచివేత, ఎగ్జిట్ పోల్స్ అంశాలపై అల్‌జజీరా కథనాలు రాసింది.

చైనా

భారత్ తమ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానం అంటూనే పొరుగుదేశ చర్యలు తమ సంస్థలను అసంతృప్తికి గురిచేశాయని చైనా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించడాన్ని తప్పుబట్టింది. దాన్ని ఎప్పటికీ భారత్ భూభాగంగా గుర్తించబోమంది.

పాకిస్తాన్

బీజేపీ ఓటమి పాలవ్వాలని ప్రతి పాకిస్థానీ కోరుకుంటున్నట్లు అక్కడి మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని రీట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ను పాకిస్తాన్ నాయకులు కీర్తిస్తున్నారంటూ బీజేపీ విరుచుకుపడింది.

రష్యా

భారత్‌లో ఎన్నికలపై రష్యా కూడా పలుమార్లు స్పందించింది. భారతీయుల మనస్తత్వం, ఆ దేశ చరిత్రపై అమెరికాకు అవగాహన లేదని మండిపడింది. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూను హతమార్చేందుకు కుట్ర జరిగిందంటూ వాషింగ్టన్ పోస్ట్ రాసిన కథనంపై మాస్కో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

నెగటివ్ ప్రచారం

మరోవైపు భారత్‌లో జరుగుతున్న ఎన్నికల గురించి కొన్ని మీడియా సంస్థలు నెగటివ్ కవరేజీ చేశాయి. విదేశాంగ మంత్రి జైశంకర్ వాటిని తిప్పికొట్టారు. ఎన్నికల ఫలితాల కోసం కోర్టు మెట్లెక్కిన దేశాలు..వాటిని ఎలా నిర్వహించాలో భారత్‌కు నేర్పిస్తున్నాయంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Recent

- Advertisment -spot_img