Homeఫ్లాష్ ఫ్లాష్Onion Price: ఉల్లి.. క‌న్నీరు తెప్పిస్తోంది!

Onion Price: ఉల్లి.. క‌న్నీరు తెప్పిస్తోంది!

హైద‌రాబాద్ః వ‌ర్షాలు ఒక‌వైపు ఉల్లి ధ‌ర‌లు మ‌రోవైపు న‌గ‌ర వాసుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వ‌ర‌ద‌ల కార‌ణంగా ఉల్లి ఘాటు పెరుగుతోంది.

ఇటీవ‌ల‌ వరకూ వంద రూపాయలకు 7-8 కేజీల వరకూ లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు కేజీ దొరకటం కూడా గగనమవుతోంది.

భారీ వర్షాలు ఉల్లిపంటలపై తీవ్ర ప్రభావం చూపటంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయని డీలర్లు చెప్తుంటే… కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

కొత్త పంట వచ్చే వరకూ ఈ తిప్పలు తప్పవని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏగ్రేడ్ ఉల్లి ధ‌ర‌లు మార్కెట్‌లో రూ.80 దాటడం గ‌మ‌నార్హం. ప‌రిస్థితులు ఇలానే కొన‌సాగితే రూ.100 దాటే అవ‌కాశాలు ఉన్నాయని మార్కెట్లో చ‌ర్చించుకుంటున్నారు.

ద‌క్షిణాదిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు మళ్లీ ఉన్న పంట కూడా దెబ్బతింటుందని, మార్కెట్‌కు సరకు రావడం లేదని ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.

దేశంలో మొత్తం 22 మిలియన్ల టన్నులకు పైగా ఉల్లి పండుతుండగా.. వాటిలో 15.5 మిలియన్‌ టన్నుల మేర మాత్రమే వినియోగిస్తున్నాం. మిగిలిన వాటిలో చాలా వరకు పొరుగున ఉన్న చిన్న దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

పొరుగు దేశాలతో పోల్చితే భారత్‌లో ఉల్లి వినియోగం కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

చైనాలో ప్రతి పౌరుడూ ఏడాదికి సగటున 16 కిలోల ఉల్లిపాయల్ని వినియోగిస్తుండగా, పాకిస్థాన్‌లో 10.35, శ్రీలంకలో 15, బంగ్లాదేశ్‌లో 12.5 వినియోగం ఉంది. కానీ భారత్‌లో సగటున 19 కిలోల మేర వినియోగిస్తున్నారు.

మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌లలోనే 75% ఉల్లి పంట సాగు అవుతోంది. అందులోనూ ఒక్క మహారాష్ట్రే 30% ఉల్లి సాగుచేస్తోంది.

30-40% పంట సరైన నిల్వ సౌకర్యాలు లేక పాడవుతోందని రైతులు వాపోతున్నారు.

ఉల్లి ధరల పెరుగుదల వల్ల లాభపడుతున్నది అక్రమ నిల్వదారులు, నల్లబజారు వర్తకులు మాత్రమే.

వినియోగ దారుల ప్రయోజనాలు దెబ్బతినకుండా రైతుల ఆదాయాలను పెంచడానికి ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

Recent

- Advertisment -spot_img