Homeహైదరాబాద్latest Newsప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

ఇదేనిజం, వెబ్‌డెస్క్ : పొగాకు ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తోంది. దీని మూలంగా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. దేశంలో ఏటా 3.5 లక్షల మంది పొగాకు కారణంగా వచ్చిన వివిధ వ్యాధులతో చనిపోతున్నారు. పొగాకు వినియోగం వల్ల దాదాపు 25 రకాలకు పైగా క్యాన్సర్లు ప్రాణాంతకంగా మారాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరుపై దెబ్బ పడుతోంది. ఊపిరితిత్తుల వాపు, రక్తపోటుతో తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పొగాకు ఎక్కువగా వినియోగిస్తోన్న దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అక్కడ దాదాపు 30 కోట్ల మంది ధూమపానానికి బానిసయ్యారు. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగస్తున్న వారిలో ఇండియా వాటా 27 శాతంగా ఉంది. ప్రజారోగ్యాన్ని కాపాడటం, ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా..

పొగాకు ఎందుకు?
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఫారిన్ కల్చర్ చాపకింద నీరులో పాకుతోంది. 15 ఏళ్లలోపు పిల్లలు, యువత ఎక్కువగా ధూమపానం చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎలా మసలుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బోర్ కొట్టినా, ఖాళీగా ఉన్నా, ఒత్తిడి ఎక్కువగా అనిపించినా పొగాకుతో తయారైన సిగరెట్లు తాగడం పరిపాటిగా మారింది. కేవలం వాళ్లు మాత్రమే తాగకుండా ఇతరులకు అలవాటు చేస్తున్నారు. గ్రామాల్లో ఇది ఒక ప్యాషన్‌గా, సిటీలో కల్చర్‌గా తయారవుతోంది. మందు, బీర్ల లాగా ఎక్కువ ఖర్చు దీనికి కాదు. కేవలం రూ. 10-20 కే లభిస్తుండటంతో ఖర్చుకు పెద్దగా వెనుకాడటం లేదు. కొంతమంది అయితే రోజుకు కొన్ని పెట్టెల సిగరెట్లు కాలుస్తుంటారు.

ఎవరు ఎక్కువగా?

సాధారణంగా పొగాకు వినియోగించేవారిలో పురుషులు అధికంగా ఉంటున్నారు. పల్లెలు, పట్టణ మురికివాడల్లోని పురుషుల్లో 42.4 శాతం, మహిళల్లో 14.2 శాతం పొగాకు వినియోగిస్తున్నట్లు పరిశీలనలు చెబుతున్నాయి. వీరంతా పేదలు, సరైన అక్షర జ్ఞానం లేనివారే. పని ప్రదేశాల్లో ఎక్కువగా వినియోగించడానికి అలవాటు పడుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ సరిగా లేక చాలామంది జీవితాలు ఆగం అవుతున్నాయి. తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెడుతూ పిల్లలు ఆగం అవుతున్నారు. భార్య మాటకు విలువ ఇవ్వకుండా నిత్యం సిగరెట్లు, బీడీలు వంటివి తాగుతూ తమ ఆరోగ్యాన్ని ఎంతో మంది పాడు చేసుకుంటున్నారు. లేని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గ్రామాల్లో పనీపాట లేని వ్యక్తులు, ముఖ్యంగా నడివయస్సు ఉన్న వారు, నిత్యం ఒత్తిడితో కూడిన విధులు చేసేవారు పొగాకుకు ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు.

ఏం చేయాలి?

సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తులను తీసుకునే వ్యక్తులకు దూరంగా ఉండాలి. పొరపాటున కూడా ఒక్కసారే కదా అని అలవాటు చేసుకోకూడదు. అంటుకుంటే వదలని అలవాటు ధూమపానం. ఒకవేళ ఇదివరకే అలవాటు అయి ఉంటే ఒకేసారి ఆపకుండా క్రమంగా తగ్గించడం మేలు. రోజూ వ్యాయామం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. సానుకూల దృక్పథం అలవడుతుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మారుమనస్సు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ కనబర్చాలి. హెల్తీగా ఉండాలంగే ఏం చేయాలలో సన్నిహితుల నుంచి సలహాలు తీసుకోవాలి. పాటించాలి.

జర్దా, ఖైనీ వంటివాటిని అన్ని రాష్ట్రాలు నిషేధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పొగాకు ఉత్పత్తులు తయారు చేసేవారికి, వాటి మీదే ఆధారపడి జీవిస్తున్న దాదాపు మూడున్నర కోట్ల ప్రజలకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. బడ్జెట్ కేటాయింపుల్లో అధిక మొత్తాన్ని వెచ్చించి పొగాకు మరణాల్ని తగ్గించేలా కృషి చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ప్రభుత్వానిపై ఉంది.

Recent

- Advertisment -spot_img