Homeహైదరాబాద్latest News20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నా.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తో బీఆర్ఎస్ చతికిల పడిందా..?

20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నా.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తో బీఆర్ఎస్ చతికిల పడిందా..?

గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఓటమి లోక్‌సభ ఎన్నికలపై పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ ఓటమిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహించినా.. కేసీఆర్ ఫోకస్ చేయకపోవటంతోనే ఈ ఫలితాలు వచ్చాయని అంటున్నారు. ముఖ్యంగా పార్టీ పేరు మార్చడం పెద్ద తప్పుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఒక్కరంటే ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. విచిత్రం ఏంటంటే.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి.. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 14 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికి పరిమితమైయ్యారు. ఖమ్మం, మహబూబాబ్‌లో మాత్రమే రెండో స్థానంలో.. అలాగే హైదరాబాద్‌లో నాలుగో స్థానానికి పరిమితమైంది.
20 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
2001లో TRS(BRS) పార్టీ ఆవిర్భావం తర్వాత 2004లో తొలిసారిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీ 5 సీట్లు కైవసం చేసుకుంది. 2008 ఉప ఎన్నికల్లో 2 సీట్లు, 2009 సార్వత్రిక ఎన్నికల్లో 2 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలు, 2019 ఎన్నికల్లో 9 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాని 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా సున్నాకు పరిమితమైంది.

Recent

- Advertisment -spot_img