టోక్యో: ఎక్కడో హర్యానాలోని ఓ చిన్న ఊరి నుంచి వచ్చిన ఓ బాక్సర్ ఇప్పుడు ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ ఆశలు రేపుతున్నాడు.
అతడిది కూడా దేశంలోని ఎంతోమంది క్రీడాకారుల పరిస్థితే. ఎన్నో డక్కాముక్కీలు తిని ఇప్పుడు అత్యున్నత క్రీడా వేదికపై సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.
అతని పేరు అమిత్ పంగల్. బాక్సింగ్ ఫ్లైవెయిట్ కేటగిరీలో బరిలోకి దిగుతున్న అమిత్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి.
ఈ సక్సెస్‌ఫుల్ బాక్సర్‌పై ఒలింపిక్ చానెల్ రూపొందించిన వీడియో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
అన్న చేసిన త్యాగంతో..
అమిత్ ఓ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఇంట్లో చిన్నవాడు కావడంతో గారాబం ఎక్కువ. చుట్టుపక్కల వాళ్లతో తరచూ గొడవలు పడుతుండే వాడు.
బహుశా అదే అతన్ని బాక్సింగ్ వైపు నడిపించేదేమో. అతని అన్న కూడా బాక్సరే. కానీ ఇద్దరినీ బాక్సర్లుగా చేసే స్థోమత ఆ తండ్రికి లేదు.
దీంతో తన తమ్ముడి కోసం ఆ అన్న త్యాగం చేశాడు. బాక్సింగ్ కెరీర్‌ను వదిలేసి ఆర్మీలో చేరాడు. తమ్ముడి కెరీర్‌కు ఎలాంటి అడ్డంకులూ లేకుండా చూసుకున్నాడు.
తన ఆర్థిక పరిస్థితి బాగుండుంటే.. తన ఇద్దరు కొడుకులూ ఇప్పుడు దేశానికి మెడల్స్ సాధించి పెట్టేవారని అమిత్ తండ్రి చెబుతుంటాడు.
టాప్‌సీడ్ అమిత్
కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో ఘతనలు సాధించిన అమిత్.. ఇప్పుడు ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
52 కేజీల కేటగిరీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న అమిత్ కచ్చితంగా మెడల్ తీసుకొస్తాడన్న అంచనాలు ఉన్నాయి.
గతేడాది జరిగిన బాక్సింగ్ వరల్డ్‌కప్‌లో అమిత్ గోల్డ్ మెడల్ సాధించాడు.
అంతకుముందు 2019లో ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో, ఆ ఏడాదితోపాటు అంతకుముందు ఏడాది జరిగిన స్ట్రాండ్‌జా కప్‌లలోనూ అమిత్ గోల్డ్ మెడల్స్ గెలిచాడు.
ఇప్పుడు ఒలింపిక్స్‌లోనూ గోల్డ్‌తోనే తిరిగి రావాలని అతని తండ్రితోపాటు కోచ్, సన్నిహితులు కోరుకుంటున్నారు.