– సహకరించని సొంత కేడర్
– అధిష్ఠానాన్ని విమర్శించడంతో సహాయనిరాకరణ
– ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం
– మూసుకుపోయిన దారులు
– కేటీఆర్ వచ్చినా నో ఇన్విటేషన్
– దిక్కుతోచని స్థితిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే
Mynampally: ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కుమారుడు రోహిత్ కు టికెట్ దక్కకపోవడంతో సొంతపార్టీపైనే విమర్శలు చేసి చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం సొంతపార్టీ కేడర్ కూడా మైనంపల్లిని పట్టించుకోవడం లేదని సమాచారం. అధిష్ఠానాన్ని విమర్శించడంతో సొంతపార్టీ కార్యకర్తలే ఆయనను పట్టించుకోవడం లేదని టాక్. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన రోజే మైనంపల్లి తిరుమల వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. కొడుకుకు టికెట్ రావడం లేదని తెలిసి రగిలిపోయారు. ఆయన పార్టీ మారబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనను వేచి చూడమన్నారని.. మైనంపల్లి ప్రకటించారు. ఆ నేత కేటీఆరే అని అంతా భావించారు. కేటీఆర్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మైనంపల్లిని పిలిపించి మాట్లాడతారని .. వివాదం సద్దుమణుగుతుందని అంతా అనుకున్నారు. కానీ కేటీఆర్ నుంచి మైనంపల్లికి ఇన్విటేషన్ రాలేదని సమాచారం. పైగా హరీశ్ రావుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని టాక్. మొత్తానికి మైనంపల్లి ఏకాకిగా మిగిలిపోయారు.
కాంగ్రెస్లో చేరుతారా?
నిజానికి మైనంపల్లి తన కుమారుడికి టికెట్ దక్కలేదనే అసంతృప్తిగా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు, ఆయన కుమారుడికి టికెట్ వస్తుందా? అన్నది అనుమానమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే కుటుంబానికి ఒకటే టికెట్ అన్న విధానం ఉంది. ఒక వేళ రూల్స్ బ్రేక్ చేసి మైనంపల్లి కుటుంబంలో రెండు టికెట్లు ఇస్తే.. సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అంతేకాక వారంతా తమ వారసులకు కూడా టికెట్లు ఇవ్వాలని కోరుతారు. కాంగ్రెస్ పార్టీలోని అనేక కుటుంబాలు తమ వారసులను రాజకీయ రంగంలో దించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఒకవేళ మైనంపల్లికి, ఆయన కుమారుడికి టికెట్ ఇస్తే.. వారంతా టికెట్లు అడిగే అవకాశం ఉంది. దీంతో మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా అనుకూల వాతావరణం కూడా లేదు. మరోవైపు మైనంపల్లి గతంలో రేవంత్రెడ్డి మీద చేసిన కామెంట్స్ ఇటీవల వైరల్ అయ్యాయి. దీంతో ఈ కామెంట్స్ కూడా ఆయనకు నష్టం తెచ్చిపెట్టాయి.
బీజేపీలోనూ మూసుకుపోయిన దారులు..
ఇక బీజేపీలో చేరేందుకు సైతం మైనంపల్లికి దారులు మూసుకుపోయినట్టు సమాచారం. ఆయన గతంలో బండి సంజయ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆయన చేరికను బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీలో ఆయనకు ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? అన్నది ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలో మైనంపల్లి రాజకీయ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంలో పడిపోయింది. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? అనేది సస్పెన్స్ గా మారింది.