Homeహైదరాబాద్latest Newsరేవంతన్నా.. న్యాయం చేయండి

రేవంతన్నా.. న్యాయం చేయండి

  • డీఎస్సీ 2008 బాధితుల విజ్ఞప్తి
  • సీఎం ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన బాధితులు
  • రెండు రోజుల్లోగా సమగ్ర నివేదిక అందిస్తామని సీఎం వ్యక్తిగత పీఏ హామీ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ 2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం దాదాపు 200 మందికి పైగా అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో.. సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్ రెడ్డి, సీఎం బోలో విద్యాశాఖ వ్యవహారాలు చూసి అధికారి మాణిక్క రాజ్ ను కలిశారు. వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము న్యాయం కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని వాపోయారు. 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని చెప్పారు. ఈ మేరకు తమకు నియామక ప్రక్రియ జరపాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన అధికారులు.. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని రెండు రోజుల్లోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేస్తామని చెప్పారు. అధికారుల హామీతో డీఎస్సీ 2018 బాధితులు వెనుదిరిగారు. వారం రోజులు ఎదురు చూసి.. మరోసారి సీఎంను కలవాలని నిర్ణయించినట్టు “డీఎస్సీ 2008 సెలెక్టెడ్ మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్” అధ్యక్షుడు పాతూరి ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు.

15 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూపులు..
2008లో నాటి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 6వ తేదీన 35 వేల పోస్టులలో మెగా డీఎస్సీని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులను కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని, బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులని చెప్పింది. సుమారు 50 రోజుల తర్వాత ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయిస్తూ 2009 జనవరి 29వ తేదీన జీవో నంబర్‌ 28ను తీసుకొచ్చింది. బీఈడీ అభ్యర్థులు కోర్టుకు వెళ్లగా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కూడా కామన్ మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని సూచించింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం 2010 జూన్ 21న.. జీవో 27 ను విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు నియామక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాల వారీగా కామన్ మెరిట్ ప్రకారం ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. 2009 జూన్ 27వ తేదీన కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. డీఈడీ అభ్యర్థులు పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా.. జూన్ 28న కౌన్సిలింగ్ పై స్టే విధించింది. జీవో 28 ప్రకారం 30 శాతం కోటా కల్పిస్తూ కౌన్సిలింగ్ నిర్వహించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీంతో అధికారులు కౌన్సిలింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కొత్త మెరిట్ లిస్టు విడుదల చేసి 2010లో ఉద్యోగాలు ఇచ్చారు. దీంతో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం రాక ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 3500 మంది బీఈడి అభ్యర్థుల కలలు కుప్పకూలిపోయాయి. ఇందులో తెలంగాణ అభ్యర్థులు 1200 మంది వరకు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img