Homeలైఫ్‌స్టైల్‌వంటనూనెల్లో ఏది మంచిది...

వంటనూనెల్లో ఏది మంచిది…

సాదారణంగా ఇంట్లో వంటల్లో అనేక రకాల నూనెను వాడుతుంటారు జనాలు.

ఆవ నూనె, అవిశె నూనె, ఆలివ్‌ ఆయిల్‌, అవకాడో ఆయిల్‌, పొద్దు తిరుగుడు నూనె, వేరుసెనగ నూనె, కొబ్బరి, కనోలా, నువ్వుల నూనె ఇలా చాలానే కనిపిస్తాయి.

అయితే జనాలు తమ ఆరోగ్యానికి ఏది మంచిది, ఏది మంచిది కాదు అన్నది తేల్చుకోవడమే అతి పెద్ద సమస్య.

నూనెలో మనకు ప్రధానంగా కనిపించే పదార్థం కొవ్వు. ఇందులో మళ్లీ సాచురేటెడ్‌, మోనో సాచురేటెడ్‌, పాలి అన్‌ సాచురేటెడ్‌ అనే రకాలుంటాయి.

కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతారు.

కొందరు దీనిని ‘సూపర్ ఫుడ్‌’ అని కూడా అంటారు. కొబ్బరి నూనె వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రశ్నే ఉండదంటారు.

కానీ ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన దీనిని ప్యూర్‌ పాయిజన్‌(స్వచ్ఛమైన విషం)గా తేల్చింది.

మానవ శరీరం ఎక్కువ కొవ్వును జీర్ణించుకోలేదు. దీంతో అది శరీరంలో పేరుకు పోతుంది.

అలా ఎక్కువగా పేరుకు పోయిన కొవ్వు గుండె జబ్బులు, రక్తపోటులాంటి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

బ్రిటన్‌ ప్రమాణాల ప్రకారం ఒక పురుషుడు రోజుకు 30 గ్రాములకంటే ఎక్కువ నూనెను తినకూడదు. స్త్రీలయితే 20 గ్రాములే తీసుకోవాలి.

నూనెలో ఉండే కొవ్వు ఫ్యాటీ ఆమ్లాల చైన్‌ను ఏర్పరుస్తుంది.

ఈ కణాలు సంతృప్త కొవ్వులు(సాచురేటెట్‌ ఫ్యాట్స్‌), అసంతృప్త కొవ్వులు(అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్‌)తో కలిసి రక్తంలో కలిసిపోయి శరీర అవసరాలను తీరుస్తాయి.

అయితే ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువైతే అవి నేరుగా కాలేయంలో చేరుతాయి. అప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

కొబ్బరి నూనె…

కొబ్బరి నూనెపై జరిగిన పరిశోధన ప్రకారం అది మన శరీరంలో తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్ (LDL) మొత్తాన్ని పెంచుతుంది.

ఈ LDL నేరుగా గుండెపోటుకు కారణమవుతుంది.

కొబ్బరి నూనె అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL)ను కూడా అందిస్తుంది.

ఇది రక్తం నుంచి LDLను ఆకర్షిస్తుంది.

కొందరు అనుకుంటున్నట్లుగా లారిక్‌ యాసిడ్‌ ఆరోగ్యానికి మంచిదికాదని వర్జీనియాలోని జార్జ్‌మాసన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టేలర్‌ వాలెస్ అంటారు.

“HDLలో లారిక్‌ యాసిడ్‌ అనే రసాయనం ఉంటుంది. దీనిని C12 ఫ్యాటీ యాసిడ్‌ అని కూడా అంటారు.

ఇది కాలేయంలో నిల్వ అవుతుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి’’ అన్నారు ప్రొఫెసర్‌ టేలర్.

అందుకే ఇతర ఫ్యాటీ ఆమ్లాలున్నా, సంతృప్త కొవ్వులు తక్కువ ఉన్న పదార్ధాలను తినడం మంచిదని నిపుణులు అంటున్నారు.

ఒమెగా 3, ఒమెగా 6 ఉండే పాలీ అన్‌ సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు, తక్కువ కొలెస్ట్రాల్‌ ఉండే మోనో సాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు లభిస్తాయి.

పాలీ అన్‌ సాచురేటెడ్, మోనో సాచురేటెడ్ కొవ్వులతో కూడిన ఫ్యాటీ ఆమ్లాలు చాలా నూనెలలో కనిపిస్తాయి.

వాటి పరిమాణం అవి ఏ మొక్క నుంచి లభిస్తున్నాయి, దాని నుంచి నూనెను ఎలా తీస్తున్నారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ అధికంగా వాడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం 5 నుంచి 7% తగ్గుతుందని ఒక సర్వేలో తేలింది.

“అన్నిరకాల ఆలివ్‌ నూనెలను వాడే ఒక లక్షమందిపై నిర్వహించిన అధ్యయనంలో గుండె జబ్బుల ప్రమాదం వారిలో 15% తక్కువగా ఉన్నట్లు తేలింది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం టి.హెచ్‌.చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్త మార్తా గౌష్‌ ఫెర్రె అన్నారు. ఈ పరిశీలన 24 ఏళ్లపాటు సాగిందని ఆమె వెల్లడించారు.

ఆలివ్‌ ఆయిల్ అంత సురక్షితంగా ఉండటానికి అందులో ఉండే మోనో సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలే కారణమని తేలింది.

ఆలివ్ మొక్కలలోని విటమిన్లు, ఖనిజాలు, పాలీఫెనాల్స్, ఇతర సూక్ష్మపోషకాలు నూనెలో కలుస్తాయి.

ఆలివ్‌ నూనె వాడటం వల్ల మన ఆహారం ద్వారా చేరిన ఇతర హానికారక కొవ్వు పదార్ధాలు కూడా తొలగిపోతాయని శాస్త్రవేత్త మార్తా అంటారు

ఆలివ్ నూనెతో ప్రయోజనాలు

ఆలివ్‌ పండ్లను పగలగొట్టి దాని గుజ్జు నుంచి నూనెను తీస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైన నూనె అంటారు.

మన కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాను కూడా ఇది తొలగిస్తుందని చెబుతారు. ఆలివ్ ఆయిల్‌ను వాడటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్‌ కూడా తగ్గుతాయని అంటారు.

‘ఆలివ్ నూనెలో లభించే ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర మేలు చేసే పదార్ధాలు వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

మన శరీరానికి ఉపయోగపడే అనేక పదార్థాలు ఇందులో ఉన్నాయి’’ అంటారు స్పెయిన్‌లోని వాలెన్సియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో బార్బా

మధ్యధరా సముద్ర ప్రాంతంలో ప్రజలు ఆలివ్‌ నూనెను విరివిగా వాడతారు.

దీనిని మధ్యధరా ప్రాంత ప్రజల ఆహారంలో విడదీయరాని భాగం అంటారు.

ఈ ప్రాంతపు ఆహారాన్ని అత్యంత పోషక విలువలున్న ఆహారంగా చెబుతారు.

అయితే “ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న ఆహారం, పానీయాలలో గింజలు, పండ్లు, కూరగాయలు పెద్ద మొత్తంలో ఉంటాయి” అని ప్రొఫెసర్‌ మార్తా వ్యాఖ్యానించారు.

ఇతర ప్రాంతాలతో పోలిస్తే మధ్యధరా ప్రాంతపు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ పరిమాణం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదేనంటారు కొందరు నిపుణులు.

పచ్చి ఆయిల్‌ నేరుగా..

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-ఇ అధికంగా ఉన్న ఈ నూనెను ఎక్కువగా వేడి చేయడం వల్ల పోషకాలు నాశనమవుతాయి.

కాబట్టి దీనిని పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది.

ఈ ఆయిల్‌ వాడటం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని 2011లో యూరోపియన్‌ ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ తేల్చి చెప్పింది.

వర్జిన్‌ ఆలివ్‌ నూనెను తక్కువ వేడితో వంట కోసం వాడుకోవచ్చు.

ఏదైనా తక్కువే వాడాలి

పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లపై జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ కథనం రాయడమైంది.

భారతదేశంలో ప్రజలు ఆవ, వేరుసెనగ, పొద్దు తిరుగుడు నూనెల నుంచి అవిశె వరకు వివిధ రకాల నూనెలను వాడతారు.

చివరగా చెప్పేదేమిటంటే ఒకసారి వేడి చేసిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం మంచిది కాదు.

తక్కువ వేడితో వాడిన నూనెల వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఏ నూనె అయినా తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే మంచిది.

Recent

- Advertisment -spot_img