మధిర నియోజకవర్గంలో ప్రతినిమిషాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బుధవారం మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం వందనం గ్రామంలో నాలుగు కోట్ల రూపాయలతో వందనం- పుట్టకోట గ్రామాల మధ్యన బీటీ రోడ్డు నిర్మాణానికి వందనం గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. చింతకాని మండలం రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించడానికి 25 కోట్ల రూపాయలతో కోధుమూరు- వందనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మంజూరు చేసినట్లు తెలిపారు. ఎన్ఎస్పిఎల్ నీళ్ల ద్వారా రైతుల పొలాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుందని వెల్లడించారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. వారంలో రెండు రోజులు మదిర నియోజకవర్గంలో పర్యటన చేసి అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. మిగతా ఐదు రోజులు మధిర శాసనసభ్యుడిగా డిప్యూటీ సీఎం గా రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం అవుతూ మిగత జిల్లాల్లో పర్యటిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వామిని అవుతానని చెప్పారు.
రోడ్డు పనులకు శంకుస్థాపన
రూ. 2కోట్ల 70 లక్షలతో చింతకాని మండలం రేపల్లెవాడ నుంచి ఎన్ఎస్పి కెనాల్, రూ. 5 కోట్ల 60లక్షలతో రేపల్లెవాడ నుంచి నేరడ, ఆరు కోట్ల రూపాయలతో పాతర్లపాడు నుండి గోవిందపురం వరకు బిటి రోడ్డు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు.