Homeఫ్లాష్ ఫ్లాష్Arvind Kejriwal : విచారణకు రాలేను.. సమన్లను వాపస్​ తీసుకోవాలి

Arvind Kejriwal : విచారణకు రాలేను.. సమన్లను వాపస్​ తీసుకోవాలి

– ఈడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో తనకు జారీ చేసిన సమన్లను వాపస్ తీసుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో జారీ చేసినవని ఆయన తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఆయన ఈడీ ఆఫీసులో హాజరుకావాల్సి ఉండగా ఆయన వెళ్లలేదు. ఈ క్రమంలో ఢిల్లీలోని తుగ్లక్​ రోడ్​లో ఉన్న ఈడీ ఆఫీసు వద్ద ఆప్‌ కార్యకర్తలు గుమిగూడకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. అలాగే డీడీయూ మార్గ్‌లోని బీజేపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలో, ఐటీవో ప్రాంతంలోని ఆప్‌ ఆఫీసు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఇండియా గేట్‌, వికాస్ మార్గ్‌, ఐటీవో ప్రాంతంలో కొద్దిమేర ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కేజ్రీవాల్‌.. రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియడంతో అక్కడ భద్రతను పెంచారు. ఈడీ సమన్లపై తాజాగా కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘ఆ సమన్లు చట్టవిరుద్ధమైనవి. రాజకీయ ప్రేరేపితమైనవి. బీజేపీ సూచన మేరకే వాటిని పంపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నన్ను దూరం చేసేందుకు వీటిని జారీ చేశారు. వెంటనే సమన్లను ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే గురువారం ఈడీ ఎదుట హాజరుకాకూడదని నిర్ణయించుకున్న కేజ్రీవాల్..

పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌మాన్‌తో కలిసి మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈడీ ఆయనకు కొత్త తేదీతో మరోసారి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది.ఈ సమన్ల నేపథ్యంలో ఇదివరకు ఆప్‌ నేతలు కేజ్రీవాల్ అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ‘కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం అందింది. ఒకవేళ ఆయన అరెస్టయితే.. అవినీతి ఆరోపణలపై మాత్రం కాదు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే భావించాల్సి వస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆమ్‌ ఆద్మీ పార్టీ రెండు సార్లు ఓడించింది. మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ చేతిలో ఆ పార్టీ ఓటమిపాలైంది. కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేమని బీజేపీకి అర్థమైంది. అందుకే ఇలా తప్పుడు కేసులు పెడుతోంది’అని ఢిల్లీ మంత్రి అతిషీ విమర్శించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img