బాలుడు ట్యూషన్‌కని వెళ్లి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా, మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. మొదట కిడ్నప్ గా భావించారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే.. తనని ఎవ్వరు కిడ్నప్ చేయలేదు. తనకు తానే వెళ్ళాడు. వివరాలలోకి వెళ్తే.. జిల్లెలగూడ దాసరి నారాయణరావు నగర్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి ప్రైవేటు ఉద్యోగి. ఇతనికి మౌనేందర్ రెడ్డి, మహీధర్ రెడ్డి(13) ఇద్దరు కుమారులు. పిల్లలిద్దరూ మీర్‌పేటలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు. మహీధర్ రెడ్డి 8వ తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్ అయిపోగానే.. ప్రతిరోజు ఇద్దరు అన్నదమ్ములు మీర్‌పేటలో ఓ ట్యూషన్ సెంటర్‌కు ట్యూషన్‌కు వెళ్తుంటారు.
ఈ నెల 4న సాయంత్రం కూడా సోదరుడు మౌనేందర్ రెడ్డితో కలిసి మహీధర్ రెడ్డి ట్యూషన్‌కు వెళ్లాడు. మౌనేందర్ రెడ్డి ఇంటికి చేరుకోగా.. మహీధర్‌రెడ్డి మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అడిగి చూడగా.. నా కంటే ముందే ట్యూషన్ నుంచి బయటకు వచ్చినట్లు అన్న మౌనేందర్ రెడ్డి తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి చూశారు. తెలిసినవారు, బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ట్యూషన్‌కు వెళ్లిన తమ కుమారుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశారు. ఇటీవల నగరంలో కిడ్నాప్ కేసులు ఎక్కువ అవుతుండటంతో పోలీసులు వెంటనే స్పందించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం 4 స్పెషల్ టీంలను రంగంలోకి దించారు. మీర్‌పేట నుంచి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీ ఫుటేజీలను జల్లెడపట్టారు.
మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో బాలుడు ట్రైన్ టికెట్ తీసుకున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి విచారించగా.. బాలుడు తిరుపతికి టికెట్ తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తిరుపతి చేరుకొని అక్కడ మహీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలుడు తిరుపతి ఎందుకు వెళ్లాడనేదానిపై సమాధానం చెప్పటం లేదు. చదువుల ఒత్తిడి, ఇతర కారణాల వల్లే బాలుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.