బంధుమిత్రులు, చుట్టపక్కాలతో ఓ వివాహ వేదిక కళకళలాడుతున్నది.
పెండ్లి కూతరు, పెండ్లి కూతరు వేదికపైకి వచ్చారు. జిలకర బెల్లం పెట్టుకోవడం, పెండ్లి కూతరు మెడలో పెండ్లి కొడుకు తాలి కట్టడం పూర్తయింది.
ఆ తర్వాత ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం, అయ్యగారు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం, బంధుమిత్రులతో ఫోటోలు దిగడం, కుటుంబసభ్యులతో కలిసి భోజనాలు చేయడం వంటి ఎన్నో పనులు మిగిలే ఉన్నాయి.
కానీ, ఇంతలోనే ఎన్నికల అధికారుల నుంచి పెండ్లి కూతురు పూనమ్‌కు పిలుపు వచ్చింది.
ఎందుకంటే పూనమ్ రాంపూర్ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీచేయగా ఆమె పెండ్లి నాడే (మే 2న) ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
పూనమ్ విజయం సాధించింది. దాంతో గెలుపు ధృవీకరణ పత్రం అందుకోవాలని ఎన్నికల అధికారులు ఆదేశించారు.
దాంతో ఆమె పెండ్లి పీటల పైనుంచే నేరుగా పెండ్లి బట్టలతోనే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లింది.
రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధృవీకరణ పత్రాన్ని స్వీకరించి తిరిగి పెండ్లి వేడుకకు హాజరయ్యింది.
అప్పటివరకు పెండింగ్ పడిన మిగతా వివాహ తంతును మొత్తం పూనమ్ తిరిగొచ్చిన తర్వాత పూర్తిచేశారు.
కాగా, ఈ ఘటనపై పూనమ్ స్పందిస్తూ ఇది తనకు అద్భుతమైన వివాహ కానుకగా అభివర్ణించింది.
ఈ జ్ఞాపకం జీవితాంతం తనకు మనుసులో మిగిలిపోతుందంటూ సంతోషం వ్యక్తంచేసింది.