HomeజాతీయంCBI Probe on Delhi Government : ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం సీబీఐ దర్యాప్తు.. ఎందుకంటే?

CBI Probe on Delhi Government : ఢిల్లీ ప్రభుత్వంపై కేంద్రం సీబీఐ దర్యాప్తు.. ఎందుకంటే?

ఢిల్లీ ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

వెయ్యి సీఎన్‌జీ లో- ఫ్లోర్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచారణ (పీఈ) జరుపాలని సూచించింది.

కేసు నమోదుకు ముందు జరిపే దర్యాప్తే ప్రాథమిక విచారణ.

ఆప్‌ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) గత ఏడాది మార్చిలో 1,000 సీఎన్‌జీ లో-ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు ఒక టెండర్‌ జారీ చేసింది.

నాలుగు నెలల తరువాత ఈ బస్సులకు వార్షిక నిర్వహణ ఒప్పందం కోసం మరో టెండర్ జారీ చేసింది.

వెయ్యి బస్సుల కొనుగోలుకు రూ.875 కోట్లు, 12 ఏండ్ల నిర్వహణ కోసం రూ.3,500 కోట్లకు ఒప్పందం చేసుకున్నది.

అయితే ఈ టెండర్‌లో అవినీతి జరిగిందని ఢిల్లీలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.

దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన సిఫార్సు చేసిన ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని రాష్ట్ర విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ జూలైలో డీటీసీకి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. బస్సుల టెండర్, కొనుగోలులో ఎలాంటి అవినీతి జరుగలేదని తెలిపింది.

అయితే నిర్ణయం తీసుకోవడంలో విధానపరమైన లోపాలను గుర్తించినట్లు పేర్కొంది.

కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ సమర్పించిన నివేదికను కేంద్ర హోంశాఖ పరిశీలించింది.

కమిటీ గుర్తించిన విధానపరమైన లోపాలపై ప్రాథమిక విచారణ జరుపాలని సీబీఐని గురువారం ఆదేశించింది.

అయితే ఇది కేంద్రం వేధింపుల్లో భాగమేనని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది.

బీజేపీ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కమిటీ దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సంగతిని గుర్తు చేసింది.

ఆప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ప్రేరేపిత కుట్ర అని విమర్శించింది.

ఢిల్లీ ప్రజలు కొత్త బస్సులను పొందకుండా నిరోధించాలని బీజేపీ కోరుతున్నదని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌ మండిపడింది.

Recent

- Advertisment -spot_img