Homeఅంతర్జాతీయంచైనా అధ్యక్షుడు జిన్​ పింగ్ నియంతే

చైనా అధ్యక్షుడు జిన్​ పింగ్ నియంతే

– మళ్లీ అదే మాట చెప్పిన అగ్రరాజ్య అధినేత బైడెన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ‘నియంత’అని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. వీరిద్దరూ తాజాగా భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన కొద్దిసేపటికే అగ్రరాజ్య అధినేత మరోసారి జిన్‌పింగ్‌ను ‘నియంత’గా పేర్కొన్నారు. ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార మండలి శిఖరాగ్ర సదస్సు నిమిత్తం ఆరేళ్ల తర్వాత అమెరికాలో అడుగుపెట్టారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌. ఈ క్రమంలోనే బైడెన్‌తో ఆయన ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం వీరి భేటీ జరిగింది. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే బైడెన్‌ మీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జిన్‌పింగ్‌ను మీరు ఇంకా నియంతగానే భావిస్తున్నారా?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి బైడెన్‌ బదులిస్తూ.. ‘అవును. ఆయన నియంతే. ఆయన కమ్యూనిస్ట్‌ దేశాన్ని పాలిస్తున్నారు. ఆ ప్రభుత్వం మనకంటే భిన్నమైంది’అని వ్యాఖ్యానించారు. ఏదేమైనప్పటికీ.. తాము చర్చల్లో పురోగతి సాధించామని తెలిపారు. అయితే, బైడెన్‌ వ్యాఖ్యలు బీజింగ్‌ను మరోసారి అసహనానికి గురి చేసేలా కన్పిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోనూ బైడెన్‌ ఇలాగే జిన్‌పింగ్‌ను ‘నియంత’గా పేర్కొన్నారు. అప్పుడు అగ్రరాజ్య అధినేత తీరును చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని మండిపడింది. ఇప్పుడు జిన్‌పింగ్‌తో భేటీ తర్వాత కూడా బైడెన్‌ మరోసారి ఇలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఇరు దేశాల సంబంధాలను మెరుగుపర్చుకునేలా నేతలిద్దరి మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ఆ కాసేపటికే బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


నాలుగు గంటల పాటు భేటీ..


శాన్‌ ఫ్రాన్సిస్కో శివారులోని వూడ్‌సైడ్‌లో గల ఫిలోలి మాన్షన్‌ ఎస్టేట్‌లో బైడెన్‌, జిన్‌పింగ్ భేటీ జరిగింది. దాదాపు నాలుగు గంటలకు పైగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కృత్రిమ మేధ, పర్యావరణ మార్పులు, ఇరాన్‌, మధ్యప్రాచ్యం, ఉక్రెయిన్‌, తైవాన్‌, ఇండో-పసిఫిక్‌, ఆర్థిక పరమైన అంశాలపై ఇరు దేశాధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత కలిసి లంచ్‌ చేసి, మాన్షన్‌ గార్డెన్‌లో కొంతసేపు నడిచారు. అమెరికాలో అక్రమంగా డ్రగ్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న చైనా కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు ఈ భేటీలో జిన్‌పింగ్‌ అంగీకరించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో పాటు అమెరికా, చైనా మధ్య సైనిక స్థాయి చర్చల పునరుద్ధరణకు దేశాధినేతలు అంగీకరించినట్లు తెలుస్తోంది. తైవాన్‌ అంశంపైనా ఫలప్రదమైన చర్చ జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. రెండు దేశాల సంబంధాలు దెబ్బతినకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు బైడెన్‌, జిన్‌పింగ్‌ అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img