– ఇజ్రాయెల్, హమాస్‌కు అరబ్ దేశాల పిలుపు
– సామాన్యుల మరణాలు పెరిగిపోతున్నాయని ఆవేదన
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో సామాన్య పౌరుల మరణాలు పెరిగిపోతున్నాయని అరబ్ దేశాలు తెలిపాయి. వెంటనే ఇరువైపులా దాడులను విరమించుకోవాలని పిలుపునిచ్చాయి. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ సందర్భంగా శనివారం వారు తమ ఆందోళనలను ఆయన ముందుంచారు. అయితే, కాల్పుల విరమణ వల్ల హమాస్‌కు పై చేయి లభిస్తుందని బ్లింకెన్ వివరించారు. వారు తిరిగి శక్తిని కూడగట్టుకొని మరింత తీవ్రమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దౌత్యవేత్తలతో పాటు పాలస్తీనా అథారిటీ అధికారితో బ్లింకెన్ చర్చలు జరిపారు. ఆత్మ రక్షణ కోసమే గాజాలో దాడులు చేస్తున్నట్లుగా చెబుతున్న ఇజ్రాయెల్ వాదనను అంగీకరించలేమని ఈజిప్టు ప్రతినిధి అన్నారు. గాజాలోని పాలస్తీనావాసులకు సామూహిక శిక్ష విధిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. దీన్ని చట్టబద్ధ ఆత్మ రక్షణగా పేర్కొనలేమని తెలిపారు. అయితే, బ్లింకెన్ మాత్రం తన వాదనను బలంగా వినిపించారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన హేయమైన దాడికి ఆత్మరక్షణగా ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు వారి హక్కని పునరుద్ఘాటించారు. కాల్పుల విరమణ వల్ల వారి హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని అరబ్ దేశాల దౌత్యవేత్తల సమక్షంలో బ్లింకెన్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఆత్మరక్షణ హక్కుపై తమ మద్దతులో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పారు. అయితే, మానవతా సాయం దృష్ట్యా ఇజ్రాయెల్ సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలనే ప్రతిపాదనపై మాత్రం తాము సానుకూలంగా ఉన్నామన్నారు. తద్వారా గాజాలోకి పౌరులకు అవసరమైన సామగ్రి చేరేందుకు, విదేశీయులు ఈజిప్టులోకి వచ్చేందుకు అవకాశం లభిస్తుందని ఆకాంక్షించారు.