Homeహైదరాబాద్latest Newsజాతర సరే వసతులేవి?

జాతర సరే వసతులేవి?

– కొండపోచమ్మ ఆలయం వద్ద అనేక సమస్యలు
– ప్రతి ఏటా భక్తులకు ఇబ్బందులే
– తాగునీటికి తిప్పలు.. పార్కింగ్​కు తంటాలు
– పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు

  • ప్రభుత్వం స్పందించాలని భక్తుల విజ్ఞప్తి

ఇదే నిజం, జగదేవపూర్: తెలంగాణ ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. అయితే ఈ గుడివద్ద జరిగే జాతర దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి. ప్రతి ఏటా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటికి ప్రజలు తిప్పలు పడుతున్నారు. దీనికి తోడు పార్కింగ్ కు కూడా తంటాలు ఎదురవుతున్నాయి. జాతర సమీపిస్తున్నా వసతులు కల్పించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..

దేవదాయ శాఖ, ప్రభుత్వం కొండపోచమ్మ అభివృద్ధిపై చిన్న చూపే చూస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మూడు నెలల జాతరకు వచ్చే భక్తులు పలు ఇబ్బందుల పాలవుతున్నారు. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈనెల 22న కొండపోచమ్మ జాతర ప్రారంభమవుతుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. నేటికీ ఆలయం వద్ద కనీస వసతులు ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

జగదేవపూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలో గల శ్రీ కొండపోచమ్మ ఆలయం ఉంది. ప్రతి ఏటా సంక్రాతి నుంచి ఉగాది వరకు మూడు నెలల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. కొమురెల్లి మల్లన్నను దర్శించుకున్న ప్రతి భక్తుడు కొండపోచమ్మ దర్శించుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కలు చెల్లించుకుంటారు. ఇది తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఎంతోమంది భక్తులు అమ్మవారిపై నమ్మకంతో కొండపోచమ్మ దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.

ఇది చదవండి: వావ్.. రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు..

కనీస వసతులు కరువు
కొండపోచమ్మ వద్ద జాతరకు ఏర్పాట్లు అంతంత మాత్రమే చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చే జాతరకు కనీస సదుపాయాలు కల్పించడంలో దేవాదాయశాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది. ఆదివారం నుండి జాతర ప్రారంభం కానున్నప్పటికీ నేటి వరకు తాగునీటి సౌకర్యం, పార్కింగ్ తదితర వసతులు అంతంత మాత్రమే ఉన్నాయి. కొండపోచమ్మ ఆలయం వద్ద వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ నల్లాల సౌకర్యం లేకపోవడంతో భక్తులు ప్రైవేటు బోర్ల వద్ద నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పొలాల వద్ద స్నానాలు చేసుకోవడం, వంటలు చేసుకోవడానికి బిందెల ద్వారా తెచ్చుకుంటారు. గుడి ముందు మాత్రమే భక్తులు కాలు కడుక్కోవడానికి నల్లాల సౌకర్యం కల్పించారు తప్ప మిగతా ఎక్కడ కూడా తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వేల సంఖ్యలో వాహనాలు ఆలయం వద్దకు రావడంతో పార్కింగ్ కు స్థలం లేకపోవడం వల్ల రోడ్డు మీదనే వాహనాలు నిలుపుతున్నారు. దీంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణదారులు ఇబ్బందులు పడడంతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గుడి ఆలయం వద్ద ప్రభుత్వ స్థలం గాని లేకుండా పోవడంతో పార్కింగ్ ఏర్పాటుకు స్థల సమస్య తీవ్రంగా నెలకొంది. ప్రైవేట్ స్థలాలలో వాహనాలు పెడితే ఒక వాహనానికి సుమారుగా 300 నుంచి 500 వరకు వసూలు చేయడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హామీలకే పరిమితం
కొండపోచమ్మ ఆలయాన్ని యాదాద్రి మాదిరిగా మారుస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 2019 మే నెలలో మార్కుక్ మండల కేంద్రంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభంలో కొండపోచమ్మ ఆలయం వద్ద కేసీఆర్ నవచండియాగం నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో కేసీఆర్ ఆలయ అభివృద్ధికి తక్షణమే 10 కోట్ల నిధులు ప్రకటించారు. ఆ తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలుసార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కోసం మ్యాప్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా దేవదాయ శాఖ అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులతో ఆలయ అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ కొండ పోచమ్మ ఆలయం అభివృద్ధి విషయంలో అడుగు ముందుకు వేయలేకపోయారు. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తన సొంత ఖర్చులతో కోటి రూపాయలతో అమ్మవారి గోపురం నిర్మిస్తానని పలుమార్లు ప్రకటించిన నేటి వరకు గోపురం పనులు ప్రారంభం కాలేదు. ఇలా జాతర సమయంలో అతిథులు వచ్చి అభివృద్ధి కోసం మాటలు చెబుతున్నారే తప్ప చేతలో చూపెట్టకపోవడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త ప్రభుత్వం పై కొండపోచమ్మ భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి జరగకపోయినా కొత్త ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి జరగాలని భక్తులు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు. కనీసం తాగునీటి సమస్య పార్కింగ్ సమస్య తక్షణమే తీర్చాలని కోరుతున్నారు. ఆలయ ఈవో మోహన్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img