Health experts estimations on corona : కరోనా.. ఈ పేరు చెబితేనే రెండేళ్లుగా ప్రపంచమంతా వణికిపోతోంది.
అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది సాధారణ జలుబుగా మారిపోతుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వైరస్‌కు చాలా కాలంగా అలవాటు పడి ఉండటం, వ్యాక్సిన్ల కారణంగా ప్రజల రోగనిరోధక శక్తి పెరగడంతో కరోనా ఓ సాధారణ జలుబుగా మారిపోతుందని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్ జాన్ బెల్ అంటున్నారు.
ఈ వైరస్ వల్ల యూకే చాలా దారుణమైన పరిస్థితులు అనుభవించిందని, శీతాకాలం దాటితే చాలు పరిస్థితులు మెరుగవుతాయని ఆయన తెలిపారు.
ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే.. ఆరు నెలల కిందటి కంటే చాలా మెరుగ్గా ఉంది అని జాన్ బెల్ అన్నారు.
యూకేలో కొవిడ్ మరణాలు కూడా చాలా వరకూ వయసు మళ్లిన వారిలోనే సంభవిస్తున్నాయని, అవి కూడా పూర్తిగా కొవిడ్ కారణంగానే అని స్పష్టంగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం యూకేలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. ఇప్పటికే వైరస్ బారిన పడిన వాళ్లు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెర్డ్ ఇమ్యూనిటీకి తోడ్పడతారని ఆయన చెప్పారు.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ డేమ్ సారా గిల్బర్ట్ కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువైన కొద్దీ అవి బలహీనపడతాయని చెప్పారు.
ఆమె అభిప్రాయంతో జాన్ బెల్ ఏకీభవించారు. తన అభిప్రాయం మేరకు ఆ పరిస్థితి వచ్చే ఏడాది వసంత కాలం కల్లా వస్తుందని అన్నారు.
కొవిడ్ నుంచి మరో భయానకమైన వేరియెంట్ వచ్చే అవకాశాలు తక్కువని కూడా సారా గిల్బర్ట్ స్పష్టం చేశారు.