– గెజిట్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
– చట్టరూపం దాల్చిన బిల్లు
ఇదేనిజం, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు తాజాగా రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఆమోదం తెలిపింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం సైతం గెజిట్ విడుదల చేసింది. బిల్లు చట్టం రూపం దాల్చినట్టయ్యింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడగానే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన చట్టం ప్రకారం లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. అంతకుముందు గురువారం భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ ఈ 128వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంతకం చేశారు. అనంతరం రాజ్యాంగంలోని 111వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ఇవాళ రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేయడంతో బిల్లు చట్టరూపం దాల్చింది.మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రం రెండు రోజుల పాటు పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చింది. లోక్‌సభ, రాజ్యసభలో దాదాపు ఏకగ్రీవంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడటంతో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కనుంది.