హైదరాబాద్: రక్షాబంధన్.. అన్నా చెల్లళ్ల అనురాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
రాఖీ పౌర్ణమిగా జరుపుకొంటారు. తన తోడబుట్టినవాడు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అకాంక్షిస్తూ మహిళలు, యువతులు రాఖీలు కట్టడం సంప్రదాయబద్ధంగా వస్తోంది.
కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలను గుర్తుకు తెచ్చే సంప్రదాయం కావడం వల్ల ప్రతి ఒక్కరు దీన్ని ఆచరిస్తూ వస్తున్నారు.
చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు.. రాఖీ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మహిళా నాయకులు రక్షాబంధన్ కట్టారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్క, తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు, మాజీమంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత.. ఈ మధ్యాహ్నం చంద్రబాబును కలిసి రాఖీ కట్టారు.
రక్షాబంధన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని అక్షింతలు చల్లి, ఆశీర్వదించారు.
చంద్రబాబు కాళ్లు మొక్కిన సీతక్క
ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్‌లో ఉంటోన్నారు. ఈ మధ్యాహ్నం సీతక్క, పరిటాల సునీత, పీతల సుజాత వేర్వేరు వాహనాల్లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 3లోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు.
అనంతరం చంద్రబాబును కలిసి రాఖీ కట్టారు. రాఖీ కట్టిన అనంతరం సీతక్క.. చంద్రబాబు కాళ్లు మొక్కారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.
చంద్రబాబుతో పాటు ఆయన మనవడు, మాజీమంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌కూ వారంతా రాఖీ కట్టారు. స్వీట్స్ తినిపించారు.
రేవంత్ రెడ్డికీ..
దీనికి సంబంధించిన ఓ వీడియోను సీతక్క తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతకుముందు- సీతక్క.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.
మల్కాజ్‌గిరిలోని నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారామె. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా నేతలు నేరేళ్ల శారద, సునీతారావు తదితరులు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు.