Pawan chandra babu;తెలుగుదేశం, జనసేనలు ఈ ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పోటీలోకి దిగితే పరిస్థితి ఏమిటన్న దానిపై కూడా రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకుల కొరత ఉన్నా.. క్షేత్ర స్థాయిలో పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అందుకే.. తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకులే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. అంటూ ఇంత కాలంగా వినవస్తున్న వ్యాఖ్యలన్నీ పూర్వపక్షమై పోయేలా ఇటీవలి చంద్రబాబు ఖమ్మం సభ సక్సెస్ అయ్యింది. తెలంగాణలో లీడర్ లేకపోయినా.. తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందన్న విషయాన్ని తెలుగుదేశం సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకున్నా తెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గట్టి పట్టు ఉంది. ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే ఆయనకు ఏపీలోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా కూడా బలమైన ఫ్యాన్ బేస్ ఉంది.చంద్రబాబు, పవన్ కల్యాన్ భేటీ తెలంగాణలో కూడా రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తెలంగాణ రాజకీయ రణ క్షేత్రంలో అడుగు పెడితే ఇక్కడ అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, జనసేనానికి ఉన్న ఆదరణ కలిసి రాష్ట్ర రాజకీయాలపై పెను ప్రభావమే చూపే అవకాశం ఉంది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 14.7 శాతం ఓట్లతో 15 స్దానాలలో విజయం సాధించింది. అలాగే 2018 ఎన్నికలలో రెండు స్థానాలలో విజయం సాధించింది.