Homeహైదరాబాద్latest Newsధరణిపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

ధరణిపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ప్రధానమైన వాటిల్లో ఒకటి ధరణి పోర్టల్. రైతులు ఎదుర్కొంటోన్న భూసంబంధిత సమస్యలను పరిష్కరించడానికి BRS ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పోర్టల్ ఇది. ఈ పోర్టల్ ద్వారా BRS ప్రభుత్వం ఎన్నో విమర్శలకు లోనైంది. దీనిపై సుదీర్ఘకాలంగా పెద్ద వివాదం నడుస్తోంది. ధరణి పోర్టల్ వల్ల ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, భూములు ఉన్న రైతులు తమ పేర్లను ఇందులో రిజిస్టర్ చేయించుకోలేక పోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో సమయంలో ప్రకటించారు. ప్రజాదర్బార్‌లో సైతం దీనికి ఫిర్యాదులు అందాయి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికం ధరణి పోర్టల్‌కు సంబంధించనవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తమకు భూమి ఉన్నా ధరణి పోర్టల్‌లో రిజిస్టర్ కావట్లేదని, తప్పుగా నమోదైందని, వాటిని సరి చేయించాలంటూ డిమాండ్లు, విజ్ఞప్తులు అందాయి.

ఈ క్రమంలో ధరణి పోర్టల్ పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌పై అందిన సమస్యలను క్రోడీకరించి వాటిని సత్వరంగా పరిష్కారించాలని రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ వేస్తామంటూ గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా అయిదుమంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందులో కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రేమండ్ పీటర్, అడ్వొకేట్ సునీల్, పదవీ విరమణ చేసిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూదన్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) సభ్యులు. సీసీఎల్ఏ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్‌లో ఎలాంటి లోపాలు ఉన్నాయి?, వాటిని ఎలా సరిచేయవచ్చు? దాని రూపురేఖలను సమూలంగా ఎలా మార్చేయవచ్చు?.. వంటి అంశాలపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. ధరణి పోర్టల్‌ను ఎలా సరళీకరించవచ్చనే విషయంపై అధ్యయనం చేస్తుంది. అనంతరం ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.

Recent

- Advertisment -spot_img