ఇదేనిజం, భువనగిరి : జిల్లాలో వరుసగా ఆదివారం నుంచి క్రీడాకారుల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 17న భువనగిరి ప్రభుత్వ జూనియర్‌కళాశాల ఆవరణలో జాతీయస్థాయి జూనియర్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికను నిర్వహించనున్నారు. అండర్-14, 16 విభాగాల్లో ట్రై అథ్లెట్, జావెలిన్‌త్రో, పరుగుపందేలు, హైజంప్, షాట్‌పుట్ తదితర పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపికలు ఉంటాయన్నారు. ఎంపికైన క్రీడాకారులు 2024 ఫిబ్రవరిలో గుజరాత్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. అలాగే 20న భువనగిరి చెరువు కట్టపై 2కేఎం నుంచి 10కేఎం వరకు క్రాస్‌కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజేతలు ఈ నెల 23న కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రాస్‌కంట్రీ పోటీల్లో జిల్లా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు తగిన ధ్రువీకరణ పత్రాలతో ఆయా తేదీల్లో నిర్ధేశిత ప్రాంతాలకు రావాలని సూచించారు.18న ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు 18న తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో అండర్-14, 17, 19 విభాగాల్లో ఉమ్మడి జిల్లా సాఫ్ట్‌బాల్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.స్టాలిన్‌బాబు తెలిపారు. ఎంపికైన జట్లు ఈ నెల 21నుంచి 23వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు తగిన ధ్రువీకరణ పత్రాలతో సకాలంలో హాజరుకావాలని సూచించారు.