గ్రూప్ 2 పరీక్షలో వచ్చిన సమైక్య పాలకుల చరిత్ర ప్రశ్నలపై బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు మండిపడ్డారు. ఈరోజు టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో అడిగిన ప్రశ్నలను చూస్తే, టీజీపీఎస్సీనా లేక ఏపీపీఎస్సీ పరీక్షనా అనే అనుమానం కలుగక మానదు అని హరీష్ రావు అన్నారు. మలి తెలంగాణ ఉద్యమ ఉనికిని లేకుండా చేస్తున్న కుట్రలో టీజీపీఎస్సీని కూడా భాగస్వామ్యం చేయడం అత్యంత దుర్మార్గం అని మండిపడ్డారు. ఇదేనా మీరు చెప్పిన మార్పు అంటే? తెలంగాణ ఉద్యమ చరిత్ర స్థానంలో సమైక్య పాలకుల చరిత్రను చేర్చడమా? అని ప్రశ్నించారు. చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణ చరిత్ర, పోరాటం పేపర్ మీద చేసిన సంతకం కాదు, కాలం మీద చేసిన సంతకం అని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను లేకుండా చేయాలనే నీ కుటిల యత్నాలను యావత్ తెలంగాణ సమాజం గుర్తించింది. మీకు తగిన బుద్ధి చెబుతుంది అని హరీష్ రావు అన్నారు.