Homeక్రైం‘గాజా’ఆక్రమణ సరైనది కాదు

‘గాజా’ఆక్రమణ సరైనది కాదు

– ఇజ్రాయెల్​ను హెచ్చరించిన అమెరికా
– ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలను వ్యతిరేకించిన అగ్ర రాజ్యం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: హమాస్‌ నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ .. దాని చుట్టూ ఉచ్చు బలంగా బిగిస్తోంది. ఈ క్రమంలోనే గాజాలోని కీలక ప్రాంతంలోకి ఐడీఎఫ్‌ దళాలు అడుగుపెట్టాయి. మరోవైపు, హమాస్‌ను పూర్తిగా అంతమొందించేదాకా ఈ యుద్ధం ఆగబోదని తేల్చిచెప్పిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. యుద్ధం ముగిశాక గాజా భద్రతా బాధ్యతలను తామే తీసుకుంటామని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా వ్యతిరేకించినట్లు కన్పిస్తోంది. గాజాను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఇజ్రాయెల్‌కు అంత మంచిది కాదంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ‘గాజాను తిరిగి ఆక్రమించడం అనేది ఇజ్రాయెల్‌కు, ఆ దేశ ప్రజలకు అంత మంచిది కాదని అధ్యక్షుడు జో బైడెన్‌ నమ్ముతున్నారు. యుద్ధం తర్వాత గాజా పరిస్థితి ఎలా ఉండబోతుంది? గాజాలో ఏ ప్రభుత్వం ఉంటుంది? అనే దానిపై ఇటీవల విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌.. ఈ ప్రాంతంతోని కొన్ని దేశాలతో చర్చించారు. ఎందుకంటే అక్టోబరు 6 నాటి పరిస్థితులు మళ్లీ కన్పించకపోవచ్చు. హమాస్‌ ప్రభుత్వం ఉండకపోవచ్చు’అని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బి పేర్కొన్నట్లు సదరు కథనం తెలిపింది.


యుద్ధంలో మేమే గెలుస్తాం: నెతన్యాహు


ఈ ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధం మధ్యలో మానవతా సాయానికి స్వల్ప విరామాలు ఇస్తామని ప్రకటించిన ఆయన.. కాల్పుల విరమణను పాటించే ప్రసక్తే లేదన్నారు. అంతేగాక.. ఈ యుద్ధం తామే గెలుస్తామని విశ్వాసం ప్రకటించిన నెతన్యాహు.. యుద్ధం తర్వాత నిరవధికంగా గాజాలో భద్రతా బాధ్యతను తామే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో గాజాను మళ్లీ ఇజ్రాయెల్‌ తమ అధీనంలోకి తీసుకోనుందని స్పష్టమవుతోంది. 2007 ముందు వరకు గాజా ఇజ్రాయెల్‌ అధీనంలోనే ఉండేది. ఆ తర్వాత హమాస్‌ దాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.


ఉత్తర గాజాను చుట్టుముట్టిన ఐడీఎఫ్

గాజాలో అండర్ గ్రౌండ్ దాడుల్ని ఇజ్రాయెల్‌ మరింత విస్తరిస్తోంది. హమాస్‌ మిలిటెంట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఉత్తర గాజాను సైనిక దళాలు చుట్టుముట్టాయి. మిలిటెంట్లు ఉండే ఆవరణను అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపాయి. దీనిపై ఇజ్రాయెల్‌ రక్షణమంత్రి యోవ్‌ గాలెంట్‌ మాట్లాడుతూ.. ‘హమాస్‌ను నాశనం చేయడమే మా లక్ష్యం. గాజా అతిపెద్ద ఉగ్ర స్థావరం. ఇప్పుడు మా దళాలు ఆ నగరంలోని హమాస్‌ కీలక స్థావరాలను చేరుకున్నాయి’అని పేర్కొన్నారు. అండర్​ గౌండ్ర్ సొరంగాల్లో బంకర్లలో ఉన్న మిలిటెంట్లపై దాడులకు ఐడీఎఫ్‌ సిద్ధమైనట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img