వరల్డ్ కప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 109 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో పోరాడిన నమీబియా 20 ఓవర్లలో 109 పరుగులు చేయగలిగింది. దీంతో సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో నమీబియా 21 పరుగులు చేయగా, ఒమన్ 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. సూపర్ ఓవర్ లో నమీబియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. కానీ ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. ఒమన్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యారు. మెన్స్ టీ20ల్లో ఓ జట్టులో అత్యధిక మంది వికెట్లు ముందు దొరికిపోవడం ఇదే. అంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్, స్కాట్‌లాండ్ పేరిట ఉన్నాయి. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ అయిదుగురు ప్లేయర్లు, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్‌లాండ్ అయిదుగురు ఆటగాళ్లు ఎల్బీగా ఔటయ్యారు.
అలాగే ఈ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ చివరి ఓవర్లో ఐదు పరుగులు డిఫెండ్ చేసి మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌గా మార్చడం ద్వారా సంచలన రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో చివరి ఓవర్‌లో అతి తక్కువ పరుగులను కాపాడిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. నమీబియా విజయానికి 5 పరుగులు అవసరం కావడంతో మెహ్రాన్ 4 పరుగులు ఇచ్చాడు. ఇంతకు ముందు ఈ రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్‌లో స్టెయిన్ 7 పరుగులతో డిఫెండ్ చేశాడు.