– అప్పులు కట్టలేకపోతున్నాం
– ఇల్లు గడిచే పరిస్థితి లేదు
– బండి సంజయ్కు ఆటో డ్రైవర్ల ఆవేదన
– ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ
ఇదేనిజం, కరీంనగర్ టౌన్ : ‘సార్.. మూడు నెలలుగా గిరాకీల్లేవు.. ఫైనాన్స్ తెచ్చి ఆటోనడుపుతున్నం. అప్పులకు వడ్డీలు కూడా కట్టేలేకపోతున్నం. బడి పిల్లలను కిరాయిలతో వచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తున్నది.. ఇప్పుడు ఎండాకాలం సెలవులు.. అయింతా గిరాకీ ఉండదు.. ఎట్లా బతకాలో అర్థం కావడం లేదు’.. అంటూ ఎంపీ బండి సంజయ్కు ఆటోవాలాలు మొరపెట్టుకున్నారు. ఆదివారం కరీంనగర్లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి ఆటో డ్రైవర్లను కలిశారు. వారితో చాయ్ తాగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం.. తమ ఉపాధిని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉపాధికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బండి హామీనిచ్చారు.