Homeజాతీయం#SushantSinghRajput #Suicide : ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ

#SushantSinghRajput #Suicide : ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి ఏడాది కావొస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనేది ఇప్పటికి వీడని మిస్టరీగానే మిగిలింది.

ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఐదు ఇన్వెస్టిగేటింగ్ సంస్థలు పూనుకున్నప్పటికీ, ఇంతవరకూ విజయం సాధించలేదు.

34 ఏళ్ల సుశాంత్ 2020 జూన్ 14న తన ఇంట్లోనే చనిపోయారు. మొదట్లో ఇది ఆత్మహత్య అంటూ రిపోర్టులు వచ్చాయి. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఈ కేసు అనేక మలుపులు తిరిగింది.

ముంబై పోలీస్, బిహార్ పోలీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని ముంబయి పోలీసులు చేసిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

సీబీఐ దర్యాప్తు ఫలితాలను ఇంకా వెల్లడించలేదు.

ఈ కేసులో పైకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్ సిండికేట్ కోణాన్ని ఎన్‌సీబీ పరిశోధిస్తోంది. ఇందులో అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చోటు ఉన్నట్లు ఇప్పటివరకు రుజువులు కనిపించలేదని ఈడీ చెబుతోంది.

ఇంతకీ ఈ కేసు ఏ దిశగా కదులుతోంది? దర్యాప్తు ఫలితాలు ఏం చెబుతున్నాయి? పరిశీలిద్దాం.

సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?

సుశాంత్ సింగ్ చావు హత్యా, ఆత్మహత్యా అనే విషయాన్ని సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

సుప్రీం కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించి పది నెలలు కావొస్తోంది. అయితే, సీబీఐ పరిశోధన ఫలితాలను ఇప్పటివరకూ వెల్లడించలేదు.

సీబీఐ విచారణ ఫలితాలను బహిరంగపరచాలని మహారాష్ట్ర మాజీ హోం మినిస్టర్ అనిల్ దేశముఖ్ పదే పదే అడుగుతూనే ఉన్నారు.

ఈ కేసులో బాలీవుడ్ నటి, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పీఠానీ, ఆయన కుక్ నీరజ్, దీపేష్ సావంత్‌లతో సహా పలువురు బాలీవుడ్ నటుల వాంగ్మూలాలను సీబీఐ సేకరించింది.

సుశాంత్‌ది హత్యా, కాదా అని నిర్థారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా నాయకత్వం వహించారు.

సుశాంత్ ఇంట్లో క్రైమ్ సీను రిక్రియేట్ చేశారు. డాక్టర్ గుప్త తన నివేదికను 2020 సెప్టెంబర్‌లో సీబీఐకు సమర్పించారు.

మీడియాతో మాట్లాడుతూ “సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన శరీరంపై మరే ఇతర గుర్తులూ కనిపించలేదు” అని డాక్టర్ గుప్తా చెప్పారు.

మరోవైపు, బీజేపీ ఎంపి సుబ్రమణియన్ స్వామి ఈ కేసుకు సంబంధించిన వివరాలకై ప్రధాన మంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. విచారణ కొనసాగుతోందని, అన్ని కోణాల నుంచి ఈ కేసును పరిశీలిస్తున్నామని సీబీఐ ఆయనకు తెలిపింది.

“ఈ కేసు విచారణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. ఎలక్ట్రానిక్ డివైజుల నుంచి డాటా సేకరిస్తున్నాం. సీనియర్ పోలీసు అధికారులు వివిధ ప్రదేశాల్లో విచారిస్తున్నారు” అని సీబీఐ తెలిపింది.

ఇదే మొదటి, చివరిసారి సీబీఐ సుశాంత్ కేసులో అధికారికంగా సమాచారం ఇవ్వడం. అయితే, విచారణ ఫలితాలను మాత్రం సీబీఐ వెల్లడించలేదు.

మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మహరాష్ట్ర పోలీస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సుశాంత్ కేసు దర్యాప్తుకు సంబంధించిన తదుపరి నిర్ణయం ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది.

ఈడీ దర్యాప్తు

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.15 కోట్లను రహస్యంగా తీసుకున్నారని సుశాంత్ కుటుంబం ఆరోపించింది.

మనీ లాండరింగ్ నివారణ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడి ఈ కేసును విచారించడం ప్రారంభించింది.

రియాను 2020 ఆగస్ట్ 7న విచారించారు. రియా మేనేజర్, సుశాంత్ మాజీ హౌస్ మేనేజర్‌ను కూడా విచారణకు పిలిచారు.

ఒక నెల విచారణ తరువాత “రియా మనీ లాండరింగ్ చేసిన దాఖలాలు లేవు. సుశాంత్ డబ్బును తస్కరించారు అనడానికి ఆధారాలు లేవు” అని ఈడీ తేలిచి చెప్పింది.

సుశాంత్ బ్యాక్ ఖాతా నుంచి, రియా బ్యాంకు ఖాతాకు గానీ, ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకుగానీ డబ్బు బదిలీ కాలేదని ఈడీ అధికారులు తెలిపారు.

ఎన్‌సీబీ దర్యాప్తు

రియా ఫోన్‌లో మాదక ద్రవ్యాలకు సంబంధించిన సంభాషణ కనుగొన్నామని ఈడీ తెలిపింది. దాంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.

సెప్టెంబర్ 8న ఎన్‌సీబీ రియాను అరెస్ట్ చేసింది.

“రియా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేశారు. సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందన్న విషయాన్ని ఆమె కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. తన ఫోన్‌లో దొరికిన వాట్సాప్ చాట్ ద్వారా రియాకు డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైంది” అని ఎన్‌సీబీ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

గతంలో సుశాంత్‌తో పాటూ ఒకే ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పీఠానీని మే 26న ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.

“సిద్ధార్థ్ పీఠానీ పరారీలో ఉన్నారు. ఆయనను హైదరాబాద్‌లో పట్టుకొని, అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది” అని ఎన్‌సీబీ జోనల్ హెడ్ సమీర్ వాంఖడే తెలిపారు.

ఈ కేసులో సిద్ధార్థ్‌ను విచారించడం ముఖ్యమని భావిస్తున్నారు. ఎందుకంటే సుశాంత్ చనిపోయినప్పుడు ఆయన అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.

బాలీవుడు నటులు దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలి ఖాన్, శ్రద్ధా కపూర్, అర్జున్ కపూర్లను కూడా ఎన్‌సీబీ విచారించింది. అయితే, ఈ విచారణ ఫలితాలేమిటో తెలియలేదు.

ముంబై పోలీస్ దర్యాప్తు

సుశాంత్ మరణం ఒక హైప్రొఫైల్ కేసు. అయితే, సుశాంత్ సూసైడ్ నోట్ లాంటిదేమీ రాయలేదు.

“పోస్టుమార్టం నివేదిక ప్రకారం, సుశాంత్ ఉరి వేసుకున్న కారణంగా ఆస్ఫిక్సియాతో మరణించారు” అని డిప్యుటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ త్రిముఖే తెలిపారు.

ఇది హత్య కాదని ఫోర్సెనిక్ ల్యాబరేటరీ కూడా 2020 జులై 27న ముంబయి పోలీసులకు ఒక నివేదిక సమర్పించింది.

సుశాంత్ దేహం నుంచి సేకరించిన నమూనాలో డ్రగ్స్‌గానీ, ప్రమాదకరమైన కెమికల్స్‌గానీ లభించలేదని తెలిపింది.

సుశాంత్ మెడ చుట్టూ ఒక బట్టకు సంబంధించిన దారలు కనిపించాయి. ఆ బట్టను పోలీసులు సుశాంత్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

“ఈ బట్ట 200 కేజీల బరువును మోయగలదు” అని ఫోర్సెనిక్ అధికారులు తెలిపారు.

ఈ కేసులో బిహార్ పోలీసుల రాజకీయాలు

ముంబయి పోలీసుల విచారణను ప్రశ్నిస్తూ సుశాంత్ కుటుంబం బిహార్ పోలీసు స్టేషన్‌లో మరో ఫిర్యాదు నమోదు చేసింది.

దాంతో, ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. బిహార్ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందే ఈ కేసు ఫైల్ అయింది. స్థానిక స్థాయి నుంచి రాజధాని వరకు రాజకీయ వాద, ప్రతివాదాలు నెలకొన్నాయి.

బిహార్ పోలీసులు ఈ దర్యాప్తును ముంబయి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఈ కేసులో దర్యాప్తు చేసే హక్కు బిహార్ పోలీసులకు ఉందా లేదా అన్న విషయంపై సందేహాలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

క్రమంగా, ఇది బిహార్, మహారాష్ట్రల మధ్య వాగ్యుద్ధంగా మారింది.

ఈ రకంగా ఐదు సంస్థలు సుశాంత్ కేసులో దర్యాప్తు చేస్తున్నపటికీ. ఇంతవరకూ ఈ కేసు ఓ కొలిక్కి రాలేదు.

ప్రస్తుతం ఈ కేసు సీబీఐ చేతిలో ఉండడంతో సుశాంత్ అభిమానులు, ఇతరులు కూడా వారి తదుపరి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు.

Recent

- Advertisment -spot_img