అనంత విశ్వంలో మనిషి ఒంటరి జీవా? గ్రహాంతరవాసులు ( Aliens ) ఉన్నారా? లేరా? ఎన్నో ఏండ్లుగా మానవాళికి అంతుచిక్కని రహస్యం ఇది.
అయితే, ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ఉనికి కోసం మనం వెదుకుతున్నట్టే, సుదూరాల్లో ఉన్న కొందరు మన కోసం అలాగే గాలిస్తున్నారా? గత కొనేండ్లుగా మన చర్యలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారా? అమెరికా పరిశోధకులు తాజాగా చెబుతున్న విషయాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
భూగ్రహంపై ఉన్నట్లే సుదూరాన ఉన్న కోట్లాది నక్షత్ర మండలాల్లోని గ్రహాల్లో జీవం ఉండొచ్చని అమెరికాలోని కార్నెల్ కార్ల్ సగన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లీసా కాల్టేనెగర్ అభిప్రాయపడుతున్నారు.
సౌరకుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీకి 326 కాంతి సంవత్సరాల దూరం పరిధిలో 2,034 నక్షత్ర మండలాలు ఉన్నట్టు ఆమె తెలిపారు. భూమిపై నాగరికత ప్రారంభమైన 5 వేల ఏండ్ల క్రితం నుంచి దాదాపు 1,715 నక్షత్ర మండలాలు ఎర్త్ ట్రాన్సిట్ జోన్ (ఈటీజడ్-గ్రహాన్ని గుర్తించేందుకు అవసరమైన దూరం) పరిధిలోకి వచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ నక్షత్ర మండలాల్లో వేలాది గ్రహాలు ఉన్నాయన్నారు. అందులోని 29 గ్రహాలు నీరు, రాళ్లతో నిండి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో ఆయా గ్రహాల్లో జీవం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు.
ఈటీజడ్ పరిధిలోకి వచ్చిన సమయంలో ఆ గ్రహాల్లోని ఏలియన్స్.. భూమి మీదనున్న మనుషులను గమనించే అవకాశం లేకపోలేదని వివరించారు. అప్పుడు వాళ్లకు మనం ఏలియన్స్‌గా కనిపిస్తామన్నారు.
‘ట్రాన్సిట్ పద్దతి’ ద్వారా ఈ అంచనాకు వచ్చామని పేర్కొన్నారు. అయితే, అక్కడి గ్రహాంతరవాసులు నాగరికులై, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటేనే భూమిపై మనుషుల ఉనికిని గుర్తించగలరని అధ్యయనంలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త, అమెరికన్ మ్యూజియమ్ ఆఫ్ నేచర్ హిస్టరీ డైరెక్టర్ జాకీ ఫహెర్టీ తెలిపారు. ఈ వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
80 ఏండ్లు ఆగాలి …
ఏలియన్స్ ఉనికిని గుర్తించేందుకు 1940 సంవత్సరం నుంచి రోదసిలోకి శాస్త్రవేత్తలు శక్తివంతమైన రేడియో, విద్యుదయస్కాంత తరంగాలను పంపిస్తున్నారు. ఒకవేళ, ఆ సిగ్నళ్లకు స్పందించి, ఏలియన్స్ తిరిగి మనకు సమాధానం పంపిస్తే.. ఆ సమాచారం మనకు చేరడానికి మరో 80 ఏండ్లు (2101 సంవత్సరం) పడుతుంది.
అంతరిక్షం నుంచి గుర్తుతెలియని కొన్ని సిగ్నళ్లను గతంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి ఏలియన్స్ పంపించినవి కావొచ్చని భావిస్తున్నారు. అయితే, దీన్ని అధికారికంగా ధ్రువపర్చలేదు.
ట్రాన్సిట్ పద్ధతి
నక్షత్రం చుట్టూ గ్రహం తిరిగే మార్గం, గ్రహం వ్యాసం, పరిణామక్రమం, వాతావరణం, ఇతర వివరాలను తెలుసుకునేందుకు ఉపయోగించే సాంకేతికతను ‘ట్రాన్సిట్ పద్ధతి’ అంటారు.
దీంట్లో భాగంగా నక్షత్రం విడుదల చేసే కాంతి గ్రహం ఉపరితలంపై పడినప్పుడు ఆ స్టెల్లార్ స్పెక్ట్రమ్‌ను (వక్రీభవనం, పరావర్తనం వంటి కాంతి ధర్మాలు) హై-రెజల్యూషన్ సాంకేతికత కలిగిన టెలిస్కోప్‌లతో విశ్లేషిస్తారు. ఈ విధంగా గ్రహాలు, నక్షత్రాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటారు.