ఇదే నిజం, ఖమ్మం: కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం పాటను ఆపి సింగరేణికి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక సరిత క్లినిక్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బిజెపి ప్రభుత్వం వేలంపాటను వేస్తున్నదని సింగరేణి కంపెనీ కూడా ప్రైవేట్ సంస్థలతో వేలం పాటలో పోటీపడాలనే స్థితికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. వాస్తవానికి శ్రావణపల్లిలో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వాలి. కానీ వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించి బొగ్గు గనులను కేటాయించడం సరైంది కాదన్నారు. మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలంపాటను ప్రారంభించడం సిగ్గుచేటని అన్నారు.
బొగ్గు గనులన్నీ ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత సింగరేణికి మిగిలేదేముంటుందని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వలన క్రమంగా సింగరేణి సంస్థను బలహీనపరిచి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నగదీకరణ పేరుతో దేశంలో ఆరు లక్షల కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని. అందులో భాగంగానే కోట్ల విలువైన గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 200 బొగ్గు బావులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారని, ప్రభుత్వ రంగంలో గనులు లేకపోతే యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగవుతాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోలేకపోయారని విమర్శించారు. ప్రస్తుతం సింగరేణి 40 వేల మంది పర్మినెంట్ కార్మికులకు, మరో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదని, రికార్డు స్థాయిలో అతి తక్కువ ధరకే నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేస్తున్న ఘనత సింగరేణి సంస్థకే చెందుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో ఆదాయాన్ని తీసుకొస్తున్న సింగరేణిని ప్రైవేటీకరణ అప్పజెప్పి ప్రభుత్వ ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్న కేంద్ర ప్రభుత్వ ధమననీతిని రాష్ట్ర ప్రజానీకం ఖండిరచాలని అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ వేగంగా జరిగితే విద్యుత్తు ధర విపరీతంగా పెరుగుతుందని అన్నారు.
సింగరేణికి చెందిన 22 బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలు అడగండి పోయాయని కొత్త బ్లాకులో తవ్వకాలు ప్రారంభించాలని కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇందుకు అనుమతించకుండా మోకాలు అడ్డుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ ప్రజానీకానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వేలంపాట ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనటం ఆశ్చర్యకరమని ఇది వేలంపాట ప్రక్రియను ఆమోదించడమే కదా అని ఆయన అన్నారు. కాబట్టి శ్రావణపల్లి బ్లాకుతో పాటు మిగతా బ్లాక్‌లను కూడా తక్షణమే సింగరేణికి అప్పగించాలని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రం మీద ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొని శాసనసభ తీర్మానం చేయాలని లేని పక్షంలో ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.