ప్రస్తుత కాలంలో పెళ్లి ధోరణి పూర్తిగా మారిపోయింది. పెళ్లికి ముందు ఫోటో షూట్, కవర్ సాంగ్, లైవ్ వీడియో అంటూ రకరకాల ట్రెండ్స్‌తో భారీ మొత్తంలో లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా భారతీయుల పెళ్లి ఖర్చుపై ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఓ నివేదికను వెల్లడించింది. సగటు భారతీయలు చదువుతో పోల్చితే పెళ్లిపైనే రెండింతలు అధికంగా ఖర్చు చేస్తున్నారని ఆ నివేదికలో వెల్లడించింది.
భారతీయల పెళ్లి మార్కెట్ అనేది రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని ఆ సంస్థ ఓ అంచనా వేసింది. ఈ పెళ్లి మార్కెట్ కంటే ముందు ఆహారం, నిత్యావసరాలు ఉన్నాయని తెలిపింది. దేశంలో ఏటా 80 లక్షల నుంచి కోటి వరకు పెళ్లిళ్లు అవుతున్నాయని.. అదే చైనాలో అయితే 70 నుంచి 80 లక్షలు, అమెరికాలో 20 నుంచి 25 లక్షలు పెళ్లిళ్లు జరుగుతున్నట్లు అంచనా వేసింది. భారత్‌లో సగటున ఒక పెళ్లిపై కనీసం రూ.12.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని.. చదువుపైన చేసే ఖర్చు కంటే ఇది రెండింతలు ఎక్కువ అని అంచనా వేసింది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో విద్యపై చేసే ఖర్చుతో పోలిస్తే పెళ్లిళ్లపై చేసే ఖర్చు సగమే ఉంటుందని ఈ సంస్థ ఆ నివేదికలో వెల్లడించింది.