– సుప్రీంకోర్టుకు తెలిపిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే
– చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు
– రాజకీయ ప్రతీకార చర్యగా చూడొద్దన్న ముకుల్ రోహత్గీ
– విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన అత్యున్నత ధర్మాసనం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీ వేడిగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను ప్రస్తావించారు. అనంతరం సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. 17ఎ సెక్షన్ పరిధిలోని అంశాలను చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టు ముందుంచారు. రఫేల్ కొనుగోళ్లపై యశ్వంత్ సిన్హా వేసిన పిటిషన్, అనంతరం దాఖలైన పలు కేసులపై వచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. రఫేల్ కేసులో జస్టిస్ కేఎం జోసెఫ్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రఫేల్ కొనుగోళ్లపై 2019లో యశ్వంత్ సిన్హా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను జస్టిస్ కేఎం జోసెఫ్ కొట్టివేసిన విషయాన్ని సాల్వే గుర్తుచేశారు. చట్టం, సవరణలను అన్వయించడానికి అనేక ఉదాహరణలను బెంచ్ ముందు ఆయన ఉంచారు. ‘రఫేల్ కేసు ఆరోపణలు 2016కు సంబంధించినవి. 2019లో యశ్వంత్ సిన్హా పిటిషన్లపై తీర్పులు వచ్చాయి. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకునే 2019లో కేసు కొట్టేశారు. ‘1988 అవినీతి నిరోధక చట్టం’ ప్రకారం పోలీసులకు ఇన్వెస్టిగేషన్ జరిపే హక్కు ఉండదు. ఇన్వెస్టిగేషన్ అనేది పోలీసుల బాధ్యత మాత్రమే. అన్నిరకాల విధుల్లోని ప్రభుత్వ అధికారులకు సెక్షన్ 17ఎతో రక్షణ లభించింది’అని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ చట్టబద్ధం కాదు: హరీశ్ సాల్వే
వివిధ రాష్ట్రాల హైకోర్టుల తీర్పులను ఈ సందర్భంగా సాల్వే ప్రస్తావించారు. పూర్వ అంశాలకు కూడా వర్తించేలా ఆర్టికల్ 20(1)పై వచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. స్పందించిన జస్టిస్ అనిరుద్ధ బోస్.. సుప్రీంకోర్టులో తీర్పులు ఉన్నప్పుడు మిగిలిన హైకోర్టుల తీర్పుల ప్రస్తావన అవసరం లేదన్నారు. ఈ పరిణామాలన్నింటి ప్రకారం కేసు నమోదుకు గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సాల్వే వాదించారు. ఈ పరిణామాలను చూస్తే చంద్రబాబుపై ఆరోపణల విచారణకు కచ్చితంగా ముందే గవర్నర్ అనుమతి తప్పనిసరి అని చెప్పారు. 2011లో జరిగిన దేవిందర్ పాల్‌సింగ్ బుల్లర్ కేసును ఈ సందర్భంగా హరీశ్ సాల్వే ప్రస్తావించారు. ‘కేసు ప్రారంభం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేకపోతే తర్వాత పరిణామాలేవీ చట్టబద్ధం కావని బుల్లర్ కేసులో తీర్పు ఉంది. ప్రారంభమే చట్టబద్ధం కానప్పుడు కేసు మూలాన్నే తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ కేసు మూలంలోనే దోషం ఉన్నందున బుల్లర్ కేసును పరిగణనలోకి తీసుకోవాలని బలంగా కోరుతున్నా. స్కిల్ కేసులో చంద్రబాబుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ చట్టబద్ధం కాదు. దాన్నే సవాల్ చేస్తున్నా. అన్నీ కలిపేసి ఒక ఎఫ్‌ఐఆర్‌ను రూపొందించారు. అందులో ఎక్కడా చంద్రబాబు పేరు లేదు’అని హరీశ్ సాల్వే వాదించారు.
2018లోనే విచారణ మొదలైంది: ముకుల్ రోహత్గీ
2018కి ముందు విచారణ కొంతవరకు జరిగి నిలిచిపోయిందని.. అంతమాత్రాన విచారణ జరగనట్లు కాదని సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ‘2018 మేలో మెమో దాఖలు చేశారు. అందులో తగిన వివరాలు ఉన్నాయి. మెమోకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ బెంచ్ ముందు ఉంచుతున్నాం. విచారణ ముగిశాక పత్రాలు ఇచ్చామన్న దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాదనలు జరుగుతున్నప్పుడు 400 పేజీల బండిల్‌ను హైకోర్టు బెంచ్ ముందుంచారు. మేం కూడా అదేరోజు అవసరమైన డాక్యుమెంట్లను కోర్టు ముందుంచాం. 2018 చట్టసవరణ తర్వాత చంద్రబాబును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినప్పటికీ దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా చూడకూడదు. ఆయనపై తగినన్ని ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారు. కేసులో చంద్రబాబును ఎప్పుడు చేర్చినప్పటికీ విచారణ కొనసాగుతున్నట్లుగానే పరిగణించాలి. చట్టసవరణకు ముందున్న ఆరోపణలకు అంతకుముందున్న చట్టమే వర్తిస్తుంది. చట్టసవరణకు ముందున్న నేరం కాబట్టి 17ఎ వర్తించదు’అని రోహత్గీ తన వాదనలు వినిపించారు. 17ఎ ప్రకారం ఎంక్వయిరీ, ఇన్వెస్టిగేషన్ దేనికీ అవకాశం లేదని బెంచ్ పేర్కొనగా.. పబ్లిక్ ఇంట్రెస్ట్‌తో నిర్ణయాలు తీసుకుని వ్యక్తి ప్రయోజనాలకు అవకాశం కల్పిస్తే దానికి 17ఎ ఎలా వర్తిస్తుంది? అని రోహత్గీ వాదించారు. అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.
Read More :
Chandrababu Naidu క్వాష్ పిటిషన్ వాయిదా
http://idenijam.com/chandrababu-naidu-cash-petition-postponed/