HomeజాతీయంFacebook Meta Training: భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు...

Facebook Meta Training: భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు…

Facebook Meta Training: భారతీయ విద్యార్థులు, టీచర్లకు మోటా పాఠాలు…

Facebook Meta Training: భారత్‌లోని డిజిటల్ సెక్యూరిటీ, ఆన్​లైన్ వెల్‌బీయింగ్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) లాంటి విభాగాల్లో కోటి మంది విద్యార్థులకు, 10 లక్షల మంది విద్యావేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది మెటా (Meta) సంస్థ.

ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కూడా భాగమైంది.

మెటా-సీబీఎస్​సీ సంయుక్త భాగస్వామ్యంతో ఉన్నత పాఠశాలల కరిక్యులమ్ మరింత సులభతరం కానుంది.

అంతేకాకుండా విద్యార్థులకు ఆన్​లైన్ ద్వారా కంటెంట్‌కు యాక్సెస్ ఇవ్వనున్నారు.

ఈ ఆన్ లైన్ మాడ్యూల్స్​ను సీబీఎస్ఈ అధికారిక వెబ్​సైట్​లో పొందుపరచనున్నారు.

కంటెంట్ క్యూరేషన్, అధునాతన వర్చువల్ టెక్నాలజీ, అగ్మెంటెడ్ రియాలిటీ లాంటి సాంకేతికతను అభివృద్ధి పరచడానికి మెటా, సీబీఎస్ఈ సంయుక్తంగా పనిచేయనున్నాయి.

ఇంటిగ్రేటెడ్ ఇమ్మెర్సివ్ టెక్నాలజీలను విద్యలో భాగం చేసేందుకు కృషి చేయనున్నాయి.

డిజిటల్ నైపుణ్యాలను విద్యార్థులకు సబ్జెక్టుల్లో భాగంగా పరిచయం చేయాలని రెండు సంస్థలు నిర్దేశించాయి.

ఈ విద్యావిధానం ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న విభిన్న అభ్యాస సవాళ్లను, వనరుల కొరతను అధిగమించే విధంగా డిజిటల్ లెర్నింగ్‌కు రూపకల్పన చేస్తున్నాయి.

భారత్‌లో అభివృద్ధి చెందని ప్రాంతాలకు చెందిన విద్యార్థుల సాధికారితే లక్ష్యంగా పనిచేయనున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది.

ఇందుకోసం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్ కేంద్రాలు, న్యూ ఏజ్ స్కిల్స్ ను అందించడంతో పాటు వనరుల సాయంతో డిజిటల్ ఎకానమీ క్రియేటర్లుగా వారిని మార్చేందుకు ప్రయత్నించనున్నామని సీబీఎస్ఈ స్కిల్స్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ డైరెక్టర్ డాక్టర్ బిస్వజీత్ సాహా తెలిపారు.

మెటాతో తమ భాగస్వామ్యంతో ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆన్ లైన్ టూల్స్ వినియోగాన్ని వివరించనున్నామని బిస్వజీత్ స్పష్టం చేశారు.

డిజిటల్ ఇండియా యుగం ఇప్పుడే ప్రారంభమైందని, అగ్మెంటెడ్ రియాల్టీ, డిజిటల్ సిటిజిన్‌షిప్​ను పరిచయం చేసి విద్యార్థులను డిజిటల్ పౌరులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఫలితంగా ప్రామాణికమైన విద్యను అందించిన వారమవుతామని అన్నారు. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్ కూడా స్పష్టం చేశారు.

“ఓ కంపెనీగా భారత్ డిజిటల్ జర్నీ మాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

విద్యలో భాగంగా డిజిటల్ టూల్స్ ను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

విద్యావ్యవస్థను మరింత సులభతరం, మార్పులు చేయడానికి సీబీఎస్ఈతో కలిసి పనిచేస్తున్నాం.

ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్రామాణికంగా ఉంటుందని, నూతన సాంకేతికతలు దేశ యువత అభ్యాస ప్రయాణానికి మంచి మార్పును తీసుకొస్తుందని అనుకుంటున్నాం” అని చెప్పారు.

భవిష్యత్తులో వర్చువల్ రియాల్టీకి పెరగనున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తన కంపెనీ పేరును ఇటీవలే ‘మెటా’గా మార్చారు.

అయితే కంపెనీ అధీనంలో ఉన్న సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

కేవలం మాతృ సంస్థ పేరును మాత్రమే మార్చారు.

ప్రజలను వర్చువల్ విధానంలో కలుసుకుని వారితో కలిసి పనిచేయడం, ఉత్పత్తులను తయారు చేయడం లాంటి చర్యలను ఈ మెటా వేదికగా ద్వారా కొనసాగిస్తారు.

రానున్న దశాబ్దకాలంలో ఈ వేదిక వందకోట్లమందికి అందుబాటులోకి వస్తుందని మార్క్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img