Homeసినిమారూమర్స్​ను​ పట్టించుకోను..

రూమర్స్​ను​ పట్టించుకోను..

‘స్టూడెంట్ ఆఫ్​ ది ఇయర్​’మూవీతో బాలీవుడ్​ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా భట్.. తక్కువ టైమ్​లోనే స్టార్​ హీరోయిన్​గా పేరు తెచ్చుకుంది. టూ స్టేట్స్, హంప్టీ శర్మన్​ కీ దుల్హనియా, బద్రీనాథ్ కీ దుల్హనియా సినిమాల్లో గ్లామర్​ పాత్రలతో పాటు హైవే, రాజీ, గంగూబాయి లాంటి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్​తోనూ ఆమె ఆకట్టుకుంది. గంగూబాయి సినిమాతోనూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సైతం దక్కించుకుంది. బాలీవుడ్ స్టార్​ రణబీర్ కపూర్​ను పెళ్లి చేసుకున్న అలియా.. ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ఎపిసోడ్​కు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, అలియా భట్‌ హాజరై సందడి చేశారు. ర్యాపిడ్‌ ఫైర్‌లో భాగంగా కరణ్‌ అడిగిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిపింగ్స్‌ కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనపై వచ్చిన అతిపెద్ద రూమర్‌పై అలియా స్పందించారు. ‘ఇది ఇంటర్నెట్‌ యుగం. ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అవన్నీ వాళ్ల అపోహ మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. అవి నన్ను బాధించవు.నేను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్‌ నచ్చదని, నేను వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. ఆ విషయాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. అతడు నన్ను వేధిస్తున్నాడంటూ రకరకాల వార్తలు రాశారు. కానీ, రణ్‌బీర్‌ మంచి వ్యక్తి. అందుకే ఇలాంటి వాటి గురించి ఆలోచించను. అసలు ప్రపంచం దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ, ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్‌ చేయడం బాధ కలిగిస్తుంది’అని అలియా భట్‌ అన్నారు.

Recent

- Advertisment -spot_img