– తెల్లవారుజాము నుంచే కొనసాగుతున్న తనిఖీలు
– నగదు దాచి ఉంచారనే సమాచారంతో రెయిడ్స్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచే రెయిడ్స్ ప్రారంభమయ్యాయి. సంపత్ కుమార్, ఆయన అనుచరులు. ఆయనకు మద్దతుగా ఉన్న వ్యాపారుల ఇంట్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. పోలీసుల బందోబస్తుతో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లోని సంపత్‌కుమార్ ఇంట్లో ఐదుగురు సభ్యుల అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. జిల్లా నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. సంపత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య మహాలక్ష్మిని అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ఈక్రమంలో ఆమె స్పృహ కోల్పోయింది. సమాచారం అందుకొని హుటాహుటిన ఇంటికి చేరుకున్న సంపత్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా దాడులు చేయడమేంటని నిలదీశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు.. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు.
ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంట్లోనూ..
నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ బంగారం వ్యాపారి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ హరినారాయణ, పత్తి మిల్లు యజమాని శ్రీనివాస్, వ్యాపారి బన్సీలాల్ లాహోటి ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. తెల్లవారుజామున నుంచే ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇళ్లలో నగదు దాచి ఉంచారనే సమాచారంతోనే ఐటీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.