HomeతెలంగాణKCR రాంగ్ స్టెప్

KCR రాంగ్ స్టెప్

  • సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వడం చేటు చేసిందా?
  • 30 చోట్ల మార్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదా?
  • కొంపముంచిన ఎమ్మెల్యేలు
  • వారి తీరుతోనే పార్టీకి తీరని నష్టం
  • నియోజకవర్గాల్లో కింగ్ లా మారిన ఎమ్మెల్యేలు
  • చెప్పిందే వేదం .. చేసిందే శాసనం
  • చెల్లుబాటు కానీ ఎంపీ, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్ మాటలు
  • ద్వితీయశ్రేణి కేడర్ లో తీవ్ర అసంతృప్తి
  • ప్రజల్లో కనెక్షన్ కట్
  • వ్యతిరేకత ఉందని తెలిసినా టికెట్ ఇచ్చిన గులాబీ బాస్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఓటమిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేలే తీరు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఏకచత్రాధిపత్యం వహించారని.. వారి తీరు వల్లే పార్టీ ఓడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ 30 స్థానాల్లో అభ్యర్థులను మార్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదేమోనన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ గెలుపులో ప్రభుత్వ వ్యతిరేకత కీలకంగా పనిచేసింది. అయితే హైదరాబాద్ లో కనిపించని వ్యతిరేకత.. గ్రామీణ తెలంగాణలో స్పష్టంగా కనిపించింది. వరంగల్,కరీంనగర్ లాంటి బీఆర్ఎస్ కు గట్టి పట్టున్న జిల్లాల్లో పార్టీ ఓడిపోవడం వెనక ఎమ్మెల్యేల అహంకార ధోరణే ప్రధాన కారణమన్న విశ్లేషణ సాగుతోంది.

మార్చిన చోట గెలిచారు
బీఆర్ఎస్ పార్టీ ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఇతర నేతలకు ఇచ్చిన చోట గెలుపొందడం గమనార్హం. జనగామ, స్టేషన్ ఘన్ పూర్, ఉప్పల్, నర్సాపూర్, ఆసిఫాబాద్, అలంపూర్, బోథ్, కోరుట్ల, ఖానాపూర్ వంటి చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్ ఇచ్చే అంశంపై రెండు రకాల విశ్లేషణలు సాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారేమోనన్న కారణం ఒకటి కాగా .. తెలంగాణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు. చాలా చోట్ల మార్చింది. అయినప్పటికీ అక్కడ మెరుగైన ఫలితాలు సాధించలేదు. దీంతో గులాబీ బాస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలోని ఓ 30 సెగ్మెంట్లలో తీవ్ర వ్యతిరేకత ఉండగా.. ఈ వ్యతిరేకత క్రమంగా ఇతర నియోజకవర్గాలకు కూడా పాకింది. బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ఇది కూడా ఓ కారణమైందన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం
అధికారంలో ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. తమ నియోజకవర్గానికి కింగ్ లా ప్రవర్తించారు. మామూళ్లు వసూలు చేయడం షరా మాములైంది. ఇక నియోజవకర్గపరిధిలోనే పోలీస్ అధికారులు, ఇతర అధికారుల మార్పు మొత్తం ఎమ్మెల్యేలు చెప్పినట్టే సాగింది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రజలతో కనెక్షన్ కట్ అయ్యింది. వీరి ఎఫెక్ట్ వారి నియోజకవర్గాల మీదే కాక.. పక్క సెగ్మెంట్ల మీదే కూడా పడ్డట్టు సమాచారం. కొన్ని సెగ్మెంట్లలో ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, ఇతర ముఖ్య పదవుల్లో ఉన్న వారంతా అలంకార ప్రాయంగా మారిపోయారు. అక్కడ ఎమ్మెల్యేలే బాస్ లుగా వ్యవహరించారు. ద్వితీయశ్రేణి నేతలకు, ప్రజలకు కూడా దూరమయ్యారు. ఆ కొంతమంది ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత ఇతర సెగ్మెంట్లకు కూడా పాకింది. అయితే హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేల ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండరు. దీంతో వారు సేఫ్ అయ్యారు. కానీ గ్రామీణ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల ఆగ్రహానికి గురయ్యారు.

ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కల్చర్
ఇక గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా రాష్ట్రంలో ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కల్చర్ స్టార్ట్ అయ్యింది. తన నియోజకవర్గం పరిధిలోని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఐ లేదా సీఐ ని ట్రాన్స్ ఫర్ చేయాలంటే ఎమ్మెల్యేల లెటర్ కావాల్సిందే. పోలీసు ఉన్నతాధికారులకు కూడా అధికారం లేకుండా ఆ పవర్ మొత్తం ఎమ్మెల్యేలకు కట్టబెట్టారు. దీంతో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారిని పోలీస్ ఆఫీసర్లుగా నియమించుకున్నారు. అంతేకాక వారితో పర్సెంటేజీలు మాట్లాడుకున్నారు. ల్యాండ్, లిక్కర్, సాండ్ మాఫియాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇక సీఐలను, ఎస్సైలను అపాయింట్ చేసుకోవడానికి కూడా లంచాలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. కొంతమంది సీఐ పోస్టు కోసం దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ముట్ట జెప్పారు. కరీంనగర్ శివారు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే తన పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ లో సీఐ పోస్ట్ కోసం తొలుత రూ.15 లక్షలు తీసుకున్నారట. మూడు నాలుగు నెలల పాటూ పనిచేసిన తర్వాత మరో అధికారి ఇదే పోస్టు కోసం రూ. 30 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. దీంతో సదరు ఎమ్మెల్యే మూడు నెలలు తిరగకముందే 30 లక్షలు కట్టిన అధికారిని నియమించుకున్నారట. ఇక మొదట 15 లక్షలు కట్టిన అధికారి లబో దిబో మన్నాడట. ఇటువంటి కథలు రాష్ట్రవ్యాప్తంగా అనేకం జరిగాయి.

కేసీఆర్ మీద సానుకూలతే కానీ..
రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కేసీఆర్ మీద సానుకూలత ఉంది. కానీ ప్రజలు కేసీఆర్ గెలవాలి.. కానీ తమ ఎమ్మెల్యే ఓడాలి అని బలంగా కోరుకున్నారు. మా నియోజకవర్గంలో కేసీఆర్ ఓడినా రాష్ట్రవ్యాప్తంగా ఆయనే గెలుస్తారు అని భావించారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇక దీనికి తోడు ఎమ్మెల్యే అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం సహకరించలేదు. చాలా చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డబ్బులు పంచినా జనం వారికి ఓట్లు వేయలేదు. డబ్బులు పంచని కాంగ్రెస్ లీడర్లకే ఓట్లు వేశారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలంటూ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సమావేశం అయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.. వారందరూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహకరించని ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, జిల్లా స్థాయి నాయకులు వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవాలని కోరుకోవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓ 30 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వారిని మార్చాలన్న డిమాండ్ కూడా వినిపించింది. ఒకవేళ వారిని మార్చి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఎస్టీ నియోజకవర్గానికి చెందిన ఓ ఎమ్మెల్యే కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు.. అయినా గెలుపొందలేకపోయాడు.ఇలా ఎమ్మెల్యేల మీదున్న వ్యతిరేకత బీఆర్ఎస్ కొంపముంచిందన్న విశ్లేషణ సాగుతోంది. మరి ఇప్పటికైనా గులాబీ బాస్ అటువంటి లీడర్లను పక్కకు పెడితే బాగుంటుదని బీఆర్ఎస్ శ్రేయోభిలాషులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img