KTR : కాంగ్రెస్ పార్టీపై బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేసారు. ముంచుకొస్తున్న ముప్పును ముందే హెచ్చరించినా.. ఈ తెలివిలేని కాంగ్రెస్ సర్కారు తలకెక్కలేదు అని అన్నారు. కల్వతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టొద్దని మొత్తుకున్నా విషం తప్ప విషయం లేని ముఖ్యమంత్రి వినిపించుకోలేదు. కళ్లముందే పచ్చని పంటలు ఎండుతున్నాయని వ్యవసాయ శాఖ సమర్పించిన ప్రాథమిక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.. ఓవైపు రుణమాఫీ కాక, పెట్టుబడి సాయం రాక అన్నదాత అల్లాడుతున్న సమయంలో గోరి చుట్టు మీద రోకలి పోటులా పంటలు ఎండటంతో రైతు బతుకు ఆగమైంది అని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ కక్షగట్టి తెచ్చిన కరువు కాబట్టి రైతులను ఆదుకునే పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిదే అని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. ఎండిన ప్రతి ఎకరానికి వెంటనే రూ.25 వేల నష్ట పరిహారం ప్రకటించి వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తే రైతులతో కలిసి కాంగ్రెస్ సర్కారు భరతం పడతాం అని కేటీఆర్ హెచ్చరించారు.